తెలంగాణలో తుర్దు, ఆంధ్రలో టింగ్లీషు మాట్లాడుతున్నాం: పవన్ కల్యాణ్

తెలంగాణలో తుర్దు, ఆంధ్రలో టింగ్లీషు మాట్లాడుతున్నాం: పవన్ కల్యాణ్

Updated: Nov 13, 2019, 06:44 AM IST
తెలంగాణలో తుర్దు, ఆంధ్రలో టింగ్లీషు మాట్లాడుతున్నాం: పవన్ కల్యాణ్

విజయవాడ: ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ అనే విషయాన్ని ఎవ్వరూ కాదనడం లేదు కానీ ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలోకి మార్చాలంటే అందుకు తగిన ఏర్పాట్లు జరగాల్సిన అవసరం ఉందంటున్నాం. 90 వేల మంది ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియంలో బోధనపై కనీసం శిక్షణ కూడా ఇవ్వకుండానే, ఇంగ్లీష్‌లో వారికి ప్రావీణ్యం కల్పించకుండా ఒకేసారి ఇంగ్లీషు మీడియంలోకి మార్చేస్తాను అంటే ఎలా కుదురుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తెలుగు దండగ.. ఇంగ్లీష్ పండగా అని మార్చుకుంటూ పోతే.. అటు ఇంగ్లీషు రాక ఇటు తెలుగు సరిగా రాక విద్యార్ధులు రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతారు. అప్పుడు వారికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని పనన్ కల్యాణ్ నిలదీశారు. విద్యార్థులు నష్టపోయిన తర్వాత అప్పుడు జగన్ రెడ్డి కానీ, ఈ 150 మంది ఎమ్మెల్యేలు కానీ ఉండరనే విషయాన్ని గుర్తిస్తే బాగుంటుందని ఏపీ సర్కార్‌కి ఆయన హితవు పలికారు. 

Also read : ఏపీ సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ కౌంటర్

ఇవన్ని దృష్టిలో పెట్టుకొని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు.. 10వ తరగతి వరకు మాతృ భాషలోనే విద్యాభ్యాసం జరగాలని మాట్లాడితే, కనీసం సిగ్గులేకుండా ఆయన స్థాయికి మర్యాద కూడా ఇవ్వకుండా విమర్శిస్తున్నారని పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ ఇంగ్లీషు ముక్క లేకుండా స్పష్టంగా వారి మాతృభాషల్లో మాట్లాడుతుంటే- మన తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణలో తుర్దు, ఆంధ్రలో టింగ్లీషు మాట్లాడుతున్నామని మండిపడ్డారు. ఇప్పటికి కూడా పరిపూర్ణమైన తెలుగు మాట్లాడే పరిస్థితుల్లో మనం లేమని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు.

Also read : మాతృభాషలోనే విద్యాభ్యాసంపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై జనసేన పార్టీ అభిప్రాయాన్ని బలంగా వినిపించిన పవన్ కల్యాణ్.. ముందు అధ్యాపకులను సిద్ధం చేసి, ఒక పైలట్ ప్రాజెక్టుగా ఏదో ఒక ప్రాంతంలో అమలు చేసి  ఫలితాలను పరిశీలించాకే ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సూచించారు. 'హిందీ భాషను దక్షిణాదిపైన రుద్దాలని ప్రయత్నించిన కేంద్రంలోని పెద్దలు సైతం ఇక్కడ వ్యక్తమైన నిరసనలు చూసి వెనక్కి తగ్గారని.. ఆ స్థాయి వ్యక్తులు ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నామని చెప్పి ప్రజలు నొచ్చుకోకుండా ఎంతో పద్దతిగా మాట్లాడారు. కానీ మీరు మాత్రం ఒక హేతుబద్దత లేకుండా విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నారు' అని ప్రభుత్వం వైఖరిపై ఆయన విరుచుకుపడ్డారు. ''ఒకవేళ మీకు అంతగా ఇంగ్లీషు మీడియంపై ప్రేమ ఉంటే తిరుపతిలో సుప్రభాతం కూడా ఇంగ్లీషులో చదివించండి'' అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.