అలీ వైఎస్సార్సీపీలో చేరడంపై స్పందించిన పవన్ కల్యాణ్

అలీ వైఎస్సార్సీపీలో చేరడంపై స్పందించిన పవన్ కల్యాణ్

Last Updated : Apr 4, 2019, 01:44 PM IST
అలీ వైఎస్సార్సీపీలో చేరడంపై స్పందించిన పవన్ కల్యాణ్

అమరావతి: నటుడు అలీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తూనే వైఎస్సార్సీపీలో చేరడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనదైన స్టైల్లో స్పందించారు. పవన్ కల్యాణ్ ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశం ప్రస్తావనకు రాగా.. యాక్టర్లు, పాపులారిటీ రెండింటినీ వేరువేరుగా చూడాలని అభిప్రాయపడ్డారు. పాపులారిటీని చూసి జనం చప్పట్లు కొడతారు. అయితే, ఆ చప్పట్లను అంత సీరియస్‌గా తీసుకోవడమో లేక వాటిని నమ్మడమో చేయకూడదని అన్నారు. తనకు కూడా చాలా మంది సన్నిహితులు ఇదే విషయం చెబుతుంటారని, అలాగే తాను కూడా వాటిని నమ్మనని తెలిపారు. అదేవిధంగా అలీకి కూడా ఒక నటుడిగా ఏమైనా చేసే అవకాశం ఉంది కనుక ఆయన ఎక్కడికైనా వెళ్లొచ్చునని చెబుతూ... జగన్‌కి బలం ఉందని నమ్మాడు కనుకే అలీ అక్కడికి వెళ్లాడని, చంద్రబాబుపై నమ్మకం లేకపోవడం వల్లే అక్కడికి వెళ్లకపోయి ఉండవచ్చని పవన్ పేర్కొన్నారు. అలీ నిర్ణయం ఏదైనా అది ఆయన ఛాయిస్‌గానే చూడాల్సిన అవసరం ఉందని పవన్ స్పష్టంచేశారు.

తొలుత అలీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారనే ప్రచారం మొదలైనప్పుడు ఆయన జనసేన పార్టీలోనే చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. అందుకు కారణం జనసేనాని పవన్ కల్యాణ్, అలీ మధ్య మంచి అనుబంధం ఉండటమే. అనేక సినిమాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించడమే కాకుండా వ్యక్తిగతంగానూ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అందువల్లే ఆయన జనసేనలో చేరతారని అందరూ భావించారు. అయితే, అందరి అంచనాలను తారుమారు చేస్తూ అలీ మాత్రం చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్‌లతో వరుసగా భేటీ అయిన అనంతరం అంతిమంగా వైఎస్సార్సీపీలో చేరడానికే మొగ్గుచూపారు.

Trending News