హైదరాబాద్:దేశంలో చాలా రాష్ట్రాల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రానుందని, దీన్ని ఎదుర్కొనేందుకు మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామని అని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పీఎం, సీఎంలు, కలెక్టర్లు తప్ప మిగతా వారు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారని అన్నారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం రోజురోజుకు పెరుగుతుందని, ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదమని హెచ్చరించారు.
ప్రజలకు తాయిలాలు అందించి సరిపెడుతున్నారని, వారి జీవన స్థితిగతులు మారటం లేదని, మార్చేందుకు నేతలు ప్రయత్నం చేయటంలేదని జయప్రకాశ్ నారాయణ అన్నారు. నేర పరిశోధన, న్యాయ విచారణ వేగంగా జరగాలని కోరుకుంటూ, ప్రజలు ఎన్ కౌంటర్ వంటి సత్వర న్యాయం వైపునకు మొగ్గుచూపుతున్నారని జేపీ అన్నారు. తమ ప్రజాస్వామ్య పీఠం ఏర్పాటై ఎన్నో ఏళ్లు అవుతోందని తెలిపారు. తమ అధ్యయనాలు, పోరాటాల ఫలితంగా ఇప్పటికి దేశంలో మూడు రాజ్యాంగ సవరణలు, ఎనిమిది చట్టాలు చేశారని అన్నారు. ఇవి తాము సాధించిన విజయాలని ఆయన అన్నారు.
కోట్లాది కార్మికుల భద్రత కోసం జనవరి 8న దేశవ్యాప్త బంద్..
బీజేపీ ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని సీపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. కోట్లాది కార్మికుల భద్రత కోసం జనవరి 8న దేశవ్యాప్త బంద్ చేస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ విధానాలతో దేశంలో నిరుద్యోగ సమస్య జఠిలమైందన్నారు. ఉద్యోగ కల్పన చేయకపోగా.. ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా 200 రైతు, రైతు కూలీ సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.