అమరావతి: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. నిన్న రాత్రి ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయనపై వేటు వేశారు. గత 8 నెలల నుంచి ఏబీ వేంకటేశ్వర రావుకు ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.
ప్రధానంగా ఐదు కారణాలను చూపుతూ ఏబీ వేంకటేశ్వర రావుపై సస్పెన్షన్ వేటు పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇంటిలిజెన్స్ చీఫ్ గా పని చేసిన సమయంలో కుమారుడి సంస్థకు కాంట్రాక్ట్ ఇప్పించేందుకు ఇజ్రాయెల్ సంస్థ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్స్ తో నిబంధనలు బేఖాతర్ చేస్తూ ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది.
విదేశీ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకోవడం.. అఖిల భారత సర్వీసుల నిబంధనల ప్రకారం నిబంధనల ఉల్లంఘనేని ప్రభుత్వం పేర్కొంది.
అంతే కాకుండా ఆయన జాతీయ భద్రత ముప్పు కలిగించారని ఆరోపించింది. కాసులకు కక్కుర్తి పడి అనామక సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చారని తెలిపింది. నిఘా పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకోకపోగా.. కొనుగోలు ఆర్డర్ కాపీలను మాయం చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సస్పెన్షన్ సమయంలో ఆయన విజయవాడ హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లవద్దని ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వు కాపీల్లో పేర్కొంది. అయితే శాఖాపరంగా క్రమ శిక్షణా చర్యలు మాత్రం తాత్కాలికంగా వాయిదా వేశారు.
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ వేటు