AP Assembly Elections 2024: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలలనే లక్ష్యతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు కన్ఫార్మ్ అవ్వగా.. బీజేపీ వైఖరి తేలాల్సి ఉంది. ఇక సీట్ల మార్పుపై తెలుగుదేశంలో కసరత్తు కొనసాగుతోంది. టికెట్ల కేటాయింపులో పెను మార్పులకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కీలక నేతల సీట్లు మారబోతున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు రెండు సీట్లలో పోటీకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు చంద్రబాబు ఎప్పుడూ కూడా రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయలేదు. మొదటి సారిగా రెండో చోట్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో పాటు ఉత్తరాంధ్రలోని మరో నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన భీమిలి నుంచి పోటీ చేయవచ్చని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీకి పరిస్థితులు సానుకూలంగా మార్చుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీటు విషయంలోనూ మార్పులు జరగబోతున్నాయని.. ఆయనతో పాటు నారా లోకేష్, బాలకృష్ణ పోటీ చేసే స్థానాలు మారబోతున్నాయని అంటున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి, రెండు చోట్లా ఓటమి పాలైన పవన్ కళ్యాణ్.. ఈ సారి కూడా రెండు చోట్ల నుంచి పోటీ చేయడం దాదాపు కన్ఫార్మ్ అయింది. గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోనూ పవన్ ప్రభావం ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారట.
ఇక వరుసగా రెండుసార్లు హిందూపురం నుంచి గెలుపొందిన నందమూరి బాలకృష్ణను ఈసారి వేరే నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని టీడీపీ అధినేత ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. హిందూపురం నుంచి కాకుండా గుడివాడ నుంచి పోటీ చేయించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఓడించలేకపోతున్న మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గుడివాడ కాకపోతే ఉండి స్థానం నుంచైనా బలకృష్ణను బరిలోకి దించాలని భావిస్తున్నారట చంద్రబాబు. దీని ద్వారా గోదావరి జిల్లాల్లో పవన్-బాలయ్య కాంబినేషన్ పార్టీకి కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు.
గతంలో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన లోకేష్‌కు కూడా స్థాన చలనం కల్పించనున్నారు. నారా లోకేష్‌పై మంగళగిరిలో ఈ సారి బీసీ వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని సీఎం జగన్ నిర్ణయించారు. మంగళగిరిలో లోకేష్‌పై రెండు సార్లు వరుసగా గెలుపొందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పక్కనపెట్టి చేనేత వర్గంపై చెందిన నేతకు సీటు ఇచ్చేందుకు వైసీపీ నిర్ణయించింది. దీంతో అక్కడ లోకేష్ పోటీ చేయకుండా బీసీ వర్గానికి చెందిన నేతనే బరిలోకి దింపాలని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచించినట్లు సమాచారం. దాంతో లోకేష్‌ను టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి పోటీకి దింపే ఆలోచన చేస్తున్నారు.
లోకేష్-పవన్ కల్యాణ్ రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే అక్కడ బలం పెరుగుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బాలయ్య-పవన్ కాంబినేషన్ వల్ల గోదావరి జిల్లాల్లో పార్టీకి కలిసి వస్తుందని లెక్కలు కడుతున్నారు. దీనిపైన సర్వే నివేదికలు సిద్దం చేసినట్లు సమాచారం. ఈ మార్పులతో మూడు ప్రాంతాల్లోనూ పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు.
ఇటీవల చంద్రబాబును కలిసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాల మేరకు టీడీపీ అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎదుర్కొనేందుకు ఎన్నికల ప్రచారం ఎలా చేయాలన్న దానిపై పీకే కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారట. సంక్షేమ కార్యక్రమాల చేస్తామంటూ ప్రచారం చేయకుండా.. అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి కల్పన, యువతకు అవకాశాలు, శాంతిభద్రతలు వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారింపమని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు చెబుతున్నారు. మొత్తమ్మీద గట్టి వ్యూహంతోనే తెలుగుదేశం పార్టీ అధినేత ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Devil Movie Review: కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter