Cheetahs, Bear Spotted in Tirumala: తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నడకదారి సమీపంలో మరో 3 చిరుతపులులు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆ మూడు చిరుత పులులు సంచరిస్తున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇదిలావుండగా తిరుమలలో మరో చోట చిరుత పులిని చూసిన భక్తుల భయంతో పరుగులు తీశారు.
తిరుమల నడకదారిలో 2 రోజుల క్రితం లక్షిత అనే చిన్నారి చిరుత పులి చంపిన సంగతి తెలిసిందే. చిన్నారి లక్షితను చంపినట్టుగా భావిస్తున్న చిరుత పులిని అటవీ శాఖ అధికారులు బోనులో బంధించారు. చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు పలు చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. అలిపిరి కాలినడక మార్గన ఏడోమైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్టు అధికారులు గుర్తించారు. చిన్నారిపై దాడి చేసిన ప్రాంతానికి సమీపంలోనే ఈ చిరుత చిక్కింది. పులి బోనులో చిక్కుకోవడంతో కాలినడకన వచ్చే భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈరోజు సోమవారం ఉదయం తిరుమలలో మరో చిరుత సంచారం కలకలం రేపింది. నడకదారిలో ఈ ఉదయం కొందరు భక్తులు వెళ్తుండగా చిరుత కనిపించింది. దీంతో వారు అక్కడి నుంచి పరుగులు తీశారు. భక్తుల అరుపులతో చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయమే ఒక చిరుత చిక్కిందని భక్తులు, టీటీడీ ఊపిరి పీల్చుకోగా.. తాజాగా మరో చిరుత సంచారం కలవరపెడుతోంది. ఇదే కాకుండా శ్రీనివాసమంగాపురం శ్రీవారి మెట్టు నడక మార్గంలో 2000వ మెట్టు దగ్గర ఈరోజు ఉదయం భక్తులకు ఎలుగుబంటు కనిపించింది. భక్తుల అరుపులతో ఆ ఎలుగుబంటి అడవిలోకి పారిపోయినట్టు తెలుస్తోంది.