ఎస్వీబీసీ చైర్మన్, టాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ రొమాంటిక్ సంభాషణ ఆడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. భక్తి ఛానెల్‌లోని ఓ మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా పృధ్వీ మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. విజిలెన్స్ విచారణకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. విచారణలో తేలే అంశాలను బట్టి పృధ్వీరాజ్‌పై ఏ చర్యలు తీసుకోవాలో తెలుస్తుందన్నారు.
Also Read: మహిళతో నటుడు పృథ్వీరాజ్ రొమాంటిక్ టాక్.. ఆడియో వైరల్!
వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎస్వీబీసీ ఆఫీసుకు వెళ్లి ఉద్యోగులతో పృధ్వీ ఎలా ప్రవర్తించేవారో తెలుసుకుంటున్నారు. విజిలెన్స్ విచారణలో పృధ్వీ తప్పు చేసినట్లుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. రాజధాని రైతుల కులాలు ప్రస్తావించడం, ఎస్వీబీసీలోని ఓ మహిళా ఉద్యోగినికి వేధింపుల ఆడియో టేపుల ఆరోపణలపై నటుడు పృధ్వీరాజ్ స్పందించారు.
అమరావతి రైతులను తన మాటలు నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఆడియో టేపుల్లో వాయిస్ తనది కాదని, ఎవరో మిమిక్రీ చేసి తనను ఇరికించారని పృధ్వీరాజ్ ఆరోపించారు. తనకు శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ చైర్మన్ పదవి దక్కడాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.