ఏపీలోని గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ ప్రణాళికలలో భాగంగా మొదటి దశలో 157 పంచాయతీలను ఎంపిక చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుపై విజయవాడలో జరిగిన అవగాహన సదస్సును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఇంకా అనేక గ్రామ, పట్టణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదని.. ఈ క్రమంలో ఏపీలోని గ్రామాల్లో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తుందని లోకేశ్ అన్నారు. ఈ పనులను దాదాపు ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని ఆయన అధికారులకు తెలిపారు. అందుకోసం 500 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు ఆయన చెప్పారు.