అమరావతి: ఏపీలో భూముల సమగ్ర సర్వే నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న రాష్ట్ర సర్కార్.. గ్రామ స్థాయి నుంచే అందుకు అవసరమైన సర్వేయర్లను నియమించాలని భావిస్తోంది. 2000లకుపైగా జనాభా ఉన్న గ్రామాల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్న 11,114 గ్రామాల్లో గ్రామ సర్వేయర్లను నియమించేందుకు సర్వేసెటిల్మెంట్ విభాగానికి సర్కార్ నుంచి అనుమతి లభించింది. గ్రామ అసిస్టెంట్ సర్వేయర్ హోదాలో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు.
తొలుత సమగ్ర సర్వే పూర్తయిన అనంతరం గ్రామ స్థాయిలో నియమితులైన సర్వేయర్ల విధులు ఏంటనే సందేహాలు వ్యక్తం చేసిన పలువురు ఉన్నతాధికారులు.. ప్రాథమిక దశలో 50శాతం గ్రామ సర్వేయర్లను ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియమించుకుంటే సరిపోతుందనే వాదనలు వినిపించారు. అయితే, ప్రభుత్వం నుంచి ఒకసారి అనుమతులు లభించి, ఆదేశాలు వెలువడ్డాకా వెనుకడుగు వేయకూడదనే అభిప్రాయం వ్యక్తమవడంతో పూర్తిస్థాయిలో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలన్న ప్రతిపాదనకే అధికారులు మొగ్గుచూపారని తెలుస్తోంది.
ఐటిఐలో సివిల్ డ్రాఫ్ట్స్మెన్, డిప్లొమా, ఆపై కోర్సులు చేసిన అభ్యర్ధులు ఈ పోస్టులకు అర్హులుగా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి, రిజర్వేషన్, ఇతర నిబంధనలనే యధావిధిగా వర్తింపచేస్తారు. నియామకాలకు సంబంధించిన కీలక విధివిధానాలు, ప్రతిపాదనలను బుధవారం ఖరారు చేశారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇన్చార్జి భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) మన్మోహన్ ఈ అంశంపై కీలక భేటీ నిర్వహించిన అనంతరం ఈ ప్రతిపాదనలను ఆమోదించారు. సీసీఎల్ఏ స్థాయిలో ఈ ప్రతిపాదనలను ఆమోదించి రెవెన్యూశాఖకు పంపించారు. బుధవారం రాత్రికే ఈ ప్రక్రియ అంతా ముగిసినట్లు తెలుస్తోంది. గురువారం లేదా శక్రవారం ఈ ఉద్యోగా నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి.