ప్రభుత్వ వాలంటీర్లతో రేషన్ డీలర్లకు ముప్పు !!

ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్‌ డీలర్లకు ప్రభుత్వం మంగళం పాడనుందా ? అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమౌతోంది

Last Updated : Jun 26, 2019, 11:39 AM IST
ప్రభుత్వ వాలంటీర్లతో రేషన్ డీలర్లకు ముప్పు !!

అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కలెక్టర్ల సదస్సులో  ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన మేరకు సెప్టెంబర్ 1 నుంచి నూతన విధానంతో నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. వాలంటీర్ల ద్వారా నిత్యావసరాలు హోం డెలివరీ జరుగుతుంది. ప్రభుత్వ అంచనా ప్రకారం ప్రతీ జిల్లాకు కనీసం జిల్లాకు 10 నుంచి 13 లక్షల సంచులు అవసరం. ఇందు కోసం 8 నుంచి 10 ప్యాకింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. సెప్టెంబ్ 1 లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది.

ఇదిలా ఉంటే ప్రభుత్వ నిర్ణయంతో  రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. అలాంటి సందర్భంలో తమ పరిస్థితి ఏంటిని ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా రేషన్‌షాపును నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని తమ కడుపు కొట్టద్దని వేడుకుంటున్నారు. తాజా పరిణామాల  నేపథ్యంలో తమ పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తోంది. 

వాలంటీర్ల నియామకాల్లో రేషన్‌ డీలర్లను భాగస్వాములు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే జీవనోపాధి కోసం ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఈ రోజు పౌరసరఫరాశాఖ మంత్రి, కమిషనర్‌తో రేషన్ డీలర్ల సంఘం నేతలు సమవేశం కానున్నారు. మరి రేషన్ డీలర్లు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయంశంగా మారింది. వాలంటీర్ల నియామకాల్లో వారిని భాగస్వాములు చేస్తుందా.. లేదా వారి జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తుందా ? అనేది తేలాల్సి ఉంది.
 

Trending News