Wife Killed Husband To Live With Lover: ప్రియుడితో లవ్ ఎఫైర్ పెట్టుకున్న ఓ యువతి.. తన భర్తను తెలివిగా హతమార్చి ఆ హత్యను గుండెపోటుగా మార్చేందుకు ప్రయత్నించింది. అన్నింటికి మించిన ట్విస్ట్ ఏంటంటే.. ఈ హత్యకు సహకరించిన వారిలో ఆమె ప్రియుడు, ఆమె స్నేహితులు మాత్రమే కాదు.. ఆమె తండ్రి కూడా ఉన్నాడు. అవును.. కూతురు తప్పటడుగులు వేస్తే మందలించి ఆమెను సన్మార్గంలో నడిచేలా చేయాల్సిన ఆమె తండ్రి.. కూతురిపై ఉన్న గుడ్డి ప్రేమతో అల్లుడిని చంపేందుకు సిద్ధపడ్డాడు.
అనకపల్లి జిల్లా చోడవరం మండలంలోని మారుతీ నగర్‌లో నివాసముంటున్న సామిరెడ్డి ప్రీతి రియల్ క్రైమ్ స్టోరీ ఇది. ప్రీతి ఆడిన నాటకంలో హత్యకు గురైంది ఆమె భర్త ఉద్రాక్ష హరి విజయ్. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన భార్య ప్రీతికి తమ ఇంటి వెనుక నివాసం ఉంటున్న ప్రణయ కుమార్‌తో అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించిన ఆమె భర్త.. ఇదే విషయమై ఆమెను మందలించినట్టు తెలుస్తోంది.
మరోవైపు ప్రతీ రోజు తన మాటలతో, చేతలతో మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న తన భర్త పెట్టే బాధలు భరించలేక అతడిని చంపి తన ప్రియుడు ప్రణయ్‌తో కలిసి జీవితం పంచుకోవాలని డిసైడ్ అయింది ప్రీతి. తన భర్తను చంపాలనే ఉద్దేశ్యంతో ఉన్న ప్రీతి ఒక పథకం ప్రకారం స్కెచ్ వేసింది. ఏప్రిల్ 17న అర్ధరాత్రి సమయాన్ని తన ప్లాన్ అమలు చేసేందుకు రైట్ టైమ్ గా ఎంచుకుంది. ప్రీతి తన భర్తను చంపించేందుకు తన తండ్రి సమరెడ్డి శంకర్ రావుతో పాటు ప్రియుడు బలయాది సింహ సాయి ప్రణయ్, తన స్నేహితులు లావేటి లలిన్ కుమార్, కర్రి రాము, పిట్లకొండ రాజు, సాయి అనే యువకుల సహాయం తీసుకుంది. అనకాపల్లి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ప్రీతీ ఇంట్లో మద్యం మత్తులో నిద్రపోతున్న ఆమె భర్త హరి విజయ్‌పై అందరూ కలిసి ఏకకాలంలో దాడి చేసి దుప్పటి, తలగడ సహాయంతో అతనికి ఊపిరి ఆడకుండా చేసి చంపేసినట్టు తెలుస్తోంది.
ప్రీతి తన భర్తను హత్య చేసిన తరువాత ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే కొత్త డ్రామాకు తెరతీసింది. కారులో తన భర్త శవాన్ని తీసుకొని పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్ళింది. తన భర్తకు గుండెపోటు వచ్చిందని.. చికిత్స కోసం ఇక్కడకు తీసుకొచ్చానని.., కాని అప్పటికే తన భర్త చనిపోయాడని డాక్టర్లు చెప్పినట్టుగా బంధువులకు చెప్పింది. గుండెపోటుతో తన భర్త చనిపోయాడని.. ఇందులో తన ప్రమేయం లేదని చెప్పి తప్పించుకునేందుకు యత్నించింది.
అయితే, ప్రీతి వ్యవహార శైలి పట్ల ముందు నుంచే అనుమానంతో ఉన్న ఆమె భర్త తరుపు బంధువులు.. ప్రీతి భర్త మృతి విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయంటూ పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రీతి భర్త కుటుంబసభ్యులు, బంధువుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పాడేరు పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టారు.
ప్రీతికి ఊహించని షాకిచ్చిన తండ్రి
భర్తను తెలివిగా అడ్డు తప్పించానని అనుకుంటున్న ప్రీతికి ఇంతలోనే ఆమె తండ్రి సమరెడ్డి శంకర్ రావు ఊహించని షాక్ ఇచ్చాడు. పాడేరు పోలీసుల ఎదుట లొంగిపోయిన శంకర్ రావు.. జరిగిన నేరం గురించి పోలీసులకు పూసగుచ్చినట్టుగా చెప్పి తమ నేరాన్ని అంగీకరించాడు. శంకర్ రావు ఇచ్చిన వాంగ్మూలం నమోదు చేసుకున్న పాడేరు పోలీసులు.. వెంటనే అనుమానాస్పద మృతి కేసును మర్డర్ కేసుగా నమోదు చేసి సదరు శంకర రావు ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అంతేకాకుండా ప్రీతి భర్త హత్య జరిగిన చోడవరం పోలీస్ స్టేషన్‌కు ప్రీతి భర్త హత్య కేసును ట్రాన్స్‌ఫర్ చేశారు. ప్రీతి తండ్రి శంకర్ రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారమే.. ప్రీతి, ఆమె ప్రియుడు బలయాది సింహ సాయి ప్రణయ్, ఆమె స్నేహితులు లావేటి లలిన్ కుమార్, కర్రి రాము, పిట్ల కొండ రాజు, బషీర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఏప్రిల్ 17న అర్థరాత్రి జరిగిన ప్రీతి భర్త హత్యోదంతం శంకర్ రావు వాంగ్మూలంతో ఆలస్యంగా వెలుగుచూసింది.