YSR Jayanthi 2022: వైఎస్ఆర్ జయంతి.. వైఎస్ఆర్‌కి ఎందుకంత ఫ్యాన్ ఫాలోయింగ్ ? వైయస్ఆర్ డెత్ మిస్టరీ ఏంటి ?

YSR Birth Anniversary 2022: వైఎస్ఆర్.. యెడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి.. జనం మెచ్చిన మాస్ లీడర్‌ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ జననేతకు ఘన నివాళి అర్పిస్తూ వైఎస్ఆర్‌పై స్పెషల్ స్టోరీ. 

Written by - Pavan | Last Updated : Jul 8, 2022, 02:40 AM IST
  • జనం గుండెల్లో వైఎస్ఆర్ ఎందుకు హీరో అయ్యారు ?
  • దేశంలోనే అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
  • వైఎస్ఆర్ ఆచూకీ కోసం రంగంలోకి దిగిన సుఖోయ్ ఫైటర్ జెట్
  • వైఎస్ఆర్‌ మరణం ప్రమాదమా ? పగతో చేసిన పథకమా ?
  • మరి అవినీతి ఆరోపణల సంగతేంటి ?..
YSR Jayanthi 2022: వైఎస్ఆర్ జయంతి.. వైఎస్ఆర్‌కి ఎందుకంత ఫ్యాన్ ఫాలోయింగ్ ? వైయస్ఆర్ డెత్ మిస్టరీ ఏంటి ?

YSR Birth Anniversary 2022, Interesting Facts About YSR : వైఎస్ఆర్.. యెడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి.. ఆ పేరే ఒక ప్రభంజనం.. డా రాజశేఖర్ రెడ్డిగా నిరుపేదలకు సేవ చేసిన వైద్యుడిగానే కాదు.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జనం చేత నీరాజనం అందుకున్న నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న పవర్‌ఫుల్ మాస్ లీడర్ ఆయన. రాజన్న పేరులోనే కాదు.. మ్యానరిజంలోనూ రాజసం ఉట్టిపడుతుంది. ఆయన చిరు నవ్వులో ఆప్యాయత, ఆత్మీయత ఊగిసలాడుతుంది. తెలుగోడి తెగువకు నిలువుటద్దంలా తెల్లటి పంచెకట్టు, నిండైన ఆహర్యం, అన్నివేళలా ఆకట్టుకునే చిరుదరహాసం.. మడమతిప్పని గుణం.. ఎవరికైనా ఎదురెళ్లే మొండి ధైర్యం.. సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే తత్వం.. అభాగ్యులను అక్కున చేర్చుకుని అభిమానించే స్వరం.. ఇవి రాజన్న పేరు గుర్తుకొస్తే.. కళ్లముందు కదలాడే రూపం వెనుకున్న జ్ఞాపకాలు. పాద యాత్ర పేరుతో జనంలోకి వెళ్లి.. అదే జనంలోంచి వచ్చిన మాస్ లీడర్‌ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ జననేతకు ఘన నివాళి అర్పిస్తూ... 

అది 1949, జులై 8.. వైఎస్ఆర్ పుట్టిన రోజు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో జయమ్మ, రాజా రెడ్డి దంపతులకు పుట్టిన సంతానమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అప్పటికే స్థానికంగా ప్రజా జీవితంలో ఉన్న రాజా రెడ్డికి వారసుడిగా వైద్యుడి రూపంలో నిరుపేదలకు సేవ చేస్తూ సామాజిక సేవను అలవర్చుకున్న రాజశేఖర్ రెడ్డి.. రాజకీయాల్లోకి ప్రవేశించాకా అదే సేవా భావంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తమ పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల మధ్యే ఉంటూ ప్రజల మనిషి అయ్యారు. 

2004లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ పాదయాత్రతో చంద్రబాబు నాయుడికి ఎదురెళ్లిన దీశాలి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు వరకు ప్రాంతాలన్నీ కలియతిరుగుతూ, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ.. వారికి నేనున్నానని భరోసానిస్తూ ముందుగుసాగాడు. అప్పుడు ఊపుమీదున్న తెలుగు దేశం పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ డీలాపడిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి కొత్త జోష్‌నిచ్చిన నాయకుడు. ఆ పాదయాత్ర ఫలితమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మళ్లీ పట్టం కట్టడం... 2004, మే 14న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా '' ఎడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి అను నేను'' అంటూ ఆ జనహృదయ నేతకు ప్రమాణస్వీకారం చేసే అవకాశం రావడం. 

తొలి సంతకం చేసింది ఆ ఫైలుపైనే..

ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన ''రైతులకు ఉచిత విద్యుత్ హామీ''ని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతోనే అదే ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. అంతేకాకుండా యుద్ధ ప్రాతిపదికన భారీ నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టి రైతాంగానికి సాగునీరందించే జల యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అది మొదలు రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయనను ప్రజలకు మరింత చేరువ చేశాయి. వారి గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. 

YSR Birth Anniversary 2022, YSR birth anniversary special story

ఫీజు రీఇంబర్స్‌మెంట్ పథకం: ఎంబీబీఎస్, ఇంజనీరింగ్.. డిగ్రీ ఏదైనా.. మీ పిల్లల ఉన్నత చదువులకు ఎంత ఖరీదైనా.. మీ వెనుక నేనున్నానంటూ నిరుపేదలకు చేయూతనందించిన నాయకుడు. పేదరికం కారణంగా ఏ ఒక్కరి ఉన్నత చదువులు ఆగిపోకూడదనే సదుద్దేశంతో రాజన్న ప్రవేశపెట్టిన ఫీజు రీఇంబర్స్‌మెంట్ పథకం ఎంతో మంది యువతీయువకులు ఉన్నత లక్ష్యాలకు చేరుకునేందుకు బంగారు బాటలు వేసింది.

ప్రాణాలు నిలబెట్టిన ఆరోగ్యశ్రీ పథకం, 108 అంబులెన్స్: అత్యవసర వైద్యం అవసరమైన ప్రతీ సందర్భంలోనూ మారుమూల ప్రాంతాలకు కూడా కుయ్‌కుయ్‌మని వెళ్లిన 108 అంబులెన్స్.. పేదోడు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేని కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షల ఖరీదైన వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకం పేరుతో ఉచిత వైద్యంగా అందించి ఎంతో మందికి ప్రాణాలు పోశాడు. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఎన్నో గుండెలకు ప్రాణం పోసి వారిపట్ల దేవుడయ్యాడు.  

పావలా వడ్డీకే రుణాలు: స్వయం సహాయక సంఘాలు, మహిళలు, రైతులు, చేనేత కార్మికులు.. ఇలా ఎంతోమందికి వారి కలలు సాకారం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ పావలా వడ్డీకే రుణాలు అందించి వారి ఉన్నతికి బాటలు వేశారు. 

సబ్సీడీపై రెండు రూపాయలకే కిలో బియ్యం: రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం తొలుత ప్రవేశపెట్టింది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు అయినప్పటికీ.. ఆయన తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు ఆ పథకాన్ని అటకెక్కించాయి. అయితే రేషన్ కార్డుపైనే ఆధారపడే నిరుపేదలు అర్ధాకలితో చావకూడదంటూ మళ్లీ రెండు రూపాయలకు కిలో బియ్యం అందించిన ఘనత మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కింది. 

ఇందిరమ్మ ఇళ్లు: ఉండటానికి గూడులేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు శాశ్వత పరిష్కారం చూపే గొప్ప లక్ష్యంతో వారికి నివాసం అందించే ప్రయత్నంలో కొన్ని లక్షల మందికి శాశ్వత చిరునామా అందించి వారిపాలిట దేవుడయ్యాడు. వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తొలి నాలుగున్నరేళ్లలోనే దాదాపు 39 లక్షల మందికిపైగా నిరుపేద జనానికి ఇందిరమ్మ ఇళ్లు, మరో 20 లక్షల మందికిపైగా జనానికి ఇళ్ల స్థలం మంజూరు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

అభయహస్తంతో ఆపన్నహస్తం అందించి వారికి ఆత్మీయుడయ్యారు. రెండోసారి అధికారంలోకొచ్చి ప్రజా సేవలో మరింత దూకుడు పెంచే క్రమంలోనే ఉన్నట్టుండి ఊహించని రీతిలో హెలీక్యాప్టర్ ప్రమాదం ఆయన్ని పొట్టనపెట్టుకుంది. బడి ఈడు పిల్లల నుంచి కురు వృద్ధుల వరకు.. అన్ని వయస్సుల వారు, అన్ని వర్గాల వారి సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయంగా ముందుకుసాగే ప్రయత్నంలో.. రచ్చబండకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకునే క్రమంలో.. 2009, సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కోసమని బేగంపేట్ విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లిన రాజశేఖరుడిని హెలీక్యాప్టర్ ప్రమాదం బలితీసుకుంది. ఈ ప్రమాదంలో వైఎస్ఆర్ సహా ఆరుగురు దుర్మరణపాలయ్యారు. గుర్తుపట్టడానికి కూడా వీలులేని విధంగా కాలిపోయిన శరీరాలను వారి దుస్తుల ఆధారంగా గుర్తించారు. జనం గుండె చప్పుడు తెలిసిన నాయకుడిగా.. మనసున్న మనిషిగా పేరొందిన రాజన్న ఇక లేడని తెలిసి ఎన్నో గుండెలు రోధించాయి.. ఇంకొన్ని అక్కడే ఆగిపోయాయి.
 
దేశంలోనే అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్: చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిక్స్ సీటర్ కెపాసిటీ కలిగిన బెల్ చాపర్‌లో బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 8.35 గంటలకు వైఎస్ఆర్ చిత్తూరు బయల్దేరారు. 

9.27 గంటల సమయంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉండగా వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలీక్యాప్టర్‌కి బేగంపేట్ విమానాశ్రయం, శంషాబాద్ విమానాశ్రయాల నుంచి సంబంధాలు తెగిపోయాయి. రేడియో సిగ్నల్స్ కట్ అవడంతోనే మొదలైన సెర్చ్ ఆపపరేషన్ గంటగంటకు ఉత్కంఠ పెంచుతూ అనేక మలుపులు తిరిగింది. గంటలు గడుస్తున్నా చాపర్ ఆచూకీ లభించకపోవడంతో వైఎస్ఆర్ అభిమానుల్లో, పార్టీ శ్రేణుల్లో, అధికారవర్గాల్లో ఆందోళన అంతకంతకూ రెట్టింపవుతూ వస్తోంది. వైఎస్ఆర్ క్షేమ సమాచారం కోసం యావత్ దేశం ఏపీ వైపు చూస్తున్న సమయం అది.

నాలుగు మిలిటరీ హెలీక్యాప్టర్లు నల్లమల అటవీ ప్రాంతాన్ని అణువణువూ జల్లెడపట్టి నిరాశతో వెనుదిరిగాయి. సాయంత్రం చీకటి పడటం, వాతావరణం అనుకూలించకపోవడంతో వైఎస్ఆర్ చాపర్ ఆచూకీ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుఖోయ్ యుద్ధ విమానాన్ని రంగంలోకి దింపింది. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఒకరి ఆచూకీని కనుగొనడం కోసం ఒక యుద్ధ విమానాన్ని ఉపయోగించడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడంతో ఇదొక అతి పెద్ద సెర్చ్ ఆపరేషన్‌గా దేశ చరిత్రలో నిలిచిపోయింది. 

వైఎస్ఆర్‌ మరణం ప్రమాదమా ? పథకమా ? ఎన్నో అనుమానాలు, ఆరోపణలు: 
జన నేతగా ఎదిగిన వైఎస్ఆర్ మరణం ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న చాపర్ కూలిపోవడం అనేది ప్రమాదవశాత్తుగా జరిగిందా లేక ఒక పథకం ప్రకారం జరిగిందా అనే ఆరోపణలు వినిపించాయి. నిజంగానే వాతావరణం అనుకూలించకపోవడం వల్లే వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న చాపర్ కూలిపోయిందా ? లేక తాను అనుకున్నది చేయడం కోసం ఎంతటి వారినైనా, ఎవ్వరినైనా లెక్కచేయని తత్వమే వైఎస్ఆర్‌ని బలితీసుకునేలా చేసిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ వైఎస్ఆర్‌ది పథకం ప్రకారం చేసిన హత్యే అయితే.. ఆ అవసరం ఎవరికి ఉంటుంది అనే కోణంలోనూ అనేక విశ్లేషణలు వినిపించాయి. అయితే, ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్‌దీ యాక్సిడెంటల్‌ డెత్‌గానే ధృవీకరించడం గమనార్హం. 

ys-jagans-speech-about-ysr-ysr-birth-anniversary-ysrcp-plenary.jpg

మరి అవినీతి ఆరోపణల సంగతేంటి ?.. 
ప్రజాక్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కూడా పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల పేరుతో భారీగా అవినీతికి పాల్పడి అవినీతి సొమ్ము వెనకేసుకున్నారని, మైనింగ్‌లోనూ అక్రమాలకు తెరతీసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, సూట్ కేసు కంపెనీలు పెట్టి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నారనేది ఆయనపై వినిపించిన ఆరోపణలు. అయితే, ఇవన్నీ తమ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేని వారు చేసే నిరాధారమైన ఆరోపణలే అంటారు ఆ దివంగత నేత కుమారుడు.. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

ఇంతకీ విధి గెలిచిందా ? ఓడిందా ?
సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ప్రజా జీవితంలో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రాజన్నను చూసి బహుషా విధి కూడా ఈర్ష్య పెంచుకున్నట్టుంది. విధి ఆయన్ని భౌతికంగా దూరం చేసిందే కానీ.. జనం గుండెల నుంచి దూరంగా తీసుకుపోలేకపోయింది. అందుకే.. ఆయన జనం నుంచి దూరమై పుష్కరకాలం దాటినా.. ఆ చిరునవ్వు చేసిన సంతకం మాత్రం ఇంకా జనం జ్ఞాపకాల్లో చెక్కుచెదరలేదు. ఆయనపై ఉన్న అభిమానం ఇసుమంతైనా తగ్గలేదు. జనం గుండెలను గెలుచుకున్న నాయకుడిని వారికి దూరం చేశానని విర్రవీగిన విధికి తెలియదు.. నాయకుడి స్థానం ఎప్పుడూ గుండెల్లోనే ఉంటుందని.. దటీజ్ రాజన్న..

Also read : AP, Telangana Rain Updates: ఏపీ, తెలంగాణలో భారీవర్షాలు.. వాతావరణ శాఖ నివేదిక

Also read : Driving License New Rules: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏం చేయాలి, ఇకపై నో ఆర్టీవో ఆఫీస్

Also read : SBI Alert: కేవైసీ లేని ఎక్కౌంట్లను క్లోజ్ చేస్తున్న ఎస్బీఐ, మీ ఎక్కౌంట్ ఎలా ఉందో చెక్ చేసుకున్నారా ?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News