మళ్లీ రోడ్డుపై బైఠాయించిన శ్రీరెడ్డి

మరోసారి వార్తల్లోకొచ్చిన శ్రీరెడ్డి 

Last Updated : May 18, 2018, 09:01 PM IST
మళ్లీ రోడ్డుపై బైఠాయించిన శ్రీరెడ్డి

టాలీవుడ్‌ సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ వేధింపులు ఎక్కువయ్యాయని సంచలన ఆరోపణలు చేసి పలువురు సినీ ప్రముఖులను తీవ్ర స్థాయిలో ఏకిపారేసిన శ్రీరెడ్డి కొంత గ్యాప్ తీసుకుని మరోసారి వార్తల్లోకొచ్చారు. కిందటిసారి టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న అరాచకాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఆమె ఈసారి సినీ పరిశ్రమ గురించి కాకుండా ఉపాధి కూలీలు చేస్తున్న నిరసనకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువైందని చేసిన ఆరోపణలతో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డిని ఉపాధి కూలీలు కలిసి మద్దతు తెలపాల్సిందిగా కోరారా అని ఆశ్చర్యపోకండి.. ఎందుకంటే శ్రీరెడ్డి వద్దకు ఎవ్వరూ రాలేదు కానీ ఆమె అనుకోకుండా రోడ్డుపై వెళ్తూ మార్గం మధ్యలో ఉపాధి కూలీల ధర్నాలో పాల్గొని వారికి తన మద్దతు తెలిపారు.
 
మల్లికార్జున స్వామి దర్శనం కోసం శ్రీశైలం వెళ్తున్న శ్రీరెడ్డి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం, గురిజేపల్లి సమీపంలో కొందరు తమకు ఉపాధి పనులు కల్పించడం లేదంటూ రోడ్డుపై బైఠాయించడం చూసి ఆగిపోయారు. తన కారు దిగి, తలకు తలపాగా చుట్టుకొని స్థానికులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారామె. ధర్నాలో బైఠాయించిన అనంతరం స్థానికులతో కాసేపు ముచ్చటించిన శ్రీరెడ్డి ఆ తర్వాత మళ్లీ త‌న కారు ఎక్కి శ్రీశైలం వైపు వెళ్లిపోయారు. ఏదేమైనా అనుకోకుండా శ్రీరెడ్డి తమతో కలిసి ధర్నాలో పాల్గొనడం చూసి అవాక్కవడం ఉపాధి హామీ కూలీల వంతయ్యింది. 

Trending News