నటీనటులు : సుబ్బారావ్, రాధాబెస్సి, కేశవ కర్రి, నిత్యశ్రీ గోరు, కార్తిక్ రత్నం, విజయ ప్రవీణ, మోహన్ భగత్, ప్రణీత పట్నాయక్ తదితరులు..
సంగీతం : స‌్వీకర్ అగస్తి
సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వాడి అండ్ వరుణ్ ఛాపేకర్
సౌండ్ డిజైన్ : నాగార్జున తాళ్లపల్లి
సమర్పణ : దగ్గుపాటి రానా
నిర్మాత : విజయ ప్రవీణ పరుచూరి
రచన – దర్శకత్వం :వెంకటేశ్ మహా
న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కు తెలుగు నుంచి ఎంపికైన తొలి సినిమా, ఆపై రానా సమర్పణ.. ప్రముఖుల ప్రశంసలు ఇవన్నీ కలిసి ‘C/O కంచరపాలెం’ సినిమాను టాలీవుడ్ లో స్పెషల్ మూవీగా నిలిపాయి. రిలీజ్ కి ముందే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాపై ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.
కథ:
కంచరపాలెం స్థానికుడైన రాజు(సుబ్బారావు) ఓ గవర్నమెంట్ ఆఫీస్ లో అటెండర్ గా ఉద్యోగం చేస్తుంటాడు. ఈ క్రమంలో రాజుకి తనపై అధికారిగా వచ్చిన రాధ(రాధా బెస్సి) పరిచయం అవుతుంది.. 42 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయి ఓ తోడు కోసం ఎదురుచూస్తున్న రాధ 49 ఏళ్ళయిన ఇంకా పెళ్లవ్వని రాజు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కంచరపాలెంలో అల్లరి చిల్లరిగా తిరిగే జోసెఫ్(కార్తిక్ రత్నం) భార్గవి(ప్రణీత పట్నాయక్) అనే బ్రాహ్మణ అమ్మాయి ప్రేమించుకుంటారు. వైన్ షాపులో పనిచేసే గెడ్డం(మోహన్ భగత్) రోజు తన కొట్టుకు వస్తుండే సలీమా(విజయ్ ప్రవీణ పరుచూరి)ను ప్రేమిస్తుంటాడు. అదే ఊరిలో చదువుకుంటూ తన తోటి విద్యార్థిని సునీత (నిత్య శ్రీగోరు)ను ప్రేమిస్తాడు సుందరం(కేశవ కర్రి). కంచరపాలెంలో జరిగే ఈ నాలుగు ప్రేమకథలు చివరికి ఎలా కంచికి చేరుకున్నాయి అనేది సినిమా కథ.
నటీనటుల పనితీరు:
అందరూ కొత్తవాళ్ళే. పైగా’ కంచరపాలెం’ స్థానికులే.. ఇక చెప్పేదేముంది తమ యాస, సహజత్వంతో క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించారు. రాజు పాత్రలో సుబ్బారావు, రాధా పాత్రలో రాధాబెస్సి, గెడ్డం పాత్రలో మోహన్ భగత్, సలీమా పాత్రలో నిర్మాత విజయ ప్రవీణ పరుచూరి, జోసెఫ్ పాత్రలో కార్తీక్ రత్నం, భార్గవి పాత్రలో ప్రణీత పట్నాయక్ ఇలా ప్రతీ ఒక్కరూ తమ నేచురల్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచారు.
వీళ్ళతో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో నటుడు కిషోర్… రామ్మూర్తి అనే పాత్రలో కిషోర్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం కరెక్ట్… ఇక అమ్మోరు పాత్రలో ఉమా మహేశ్వరావు కూడా తన పాత్రతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మిగతా పాత్రలు చేసిన కంచరపాలెం స్థానికులు తమ ప్రతిభను కనబరిచారు. సినిమా చూశాక సినిమాలో పాత్రలు ఇంటి వరకూ మనతోనే ప్రయాణం చేస్తాయంటే అతిశయోక్తి కాదు.
సాంకేతికవర్గం పనితీరు:
ఇలాంటి సినిమాలకు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్… ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్ళాలంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది చాలా కీలకం. ఈ సినిమాకు పెర్ఫెక్ట్ మ్యూజిక్ అందించి సినిమాకు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తి. నిజానికి సినిమా ప్రారంభం నుండే బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అయ్యే పాటతోనే సినిమాలోకి ఇన్వాల్వ్ చేయగలిగాడు. ‘పట్టి పట్టి నన్నే సూత్తాంటే’ ,’ఆశా పాశం’ పాటలు ఆకట్టుకున్నాయి. ఆదిత్య జవ్వాడి అండ్ వరుణ్ ఛాపేకర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కంచరపాలెం అనే ఊరును చాలా నేచురల్ గా చూపిస్తూ తమ కెమెరా వర్క్ తో సినిమాకు ప్లస్ అయ్యారు.
ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఒక్క సీన్ కూడా తీసెయ్యడానికి లేకుండా ఉంది. అలాగే నాగార్జున తాళ్లపల్లి సౌండ్ డిజైనింగ్ బాగుంది. ఆర్ట్ వర్క్ బాగుంది. దర్శకుడు వెంకటేష్ మహా దర్శకుడి గా కంటే రచయితగా ఎక్కువ మార్కులు కొట్టేసాడు.. కొన్ని సన్నివేశాల్లో ప్రతిభ గల దర్శకుడి లా డీల్ చేసిన విధానం స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. కథ పరిధి మేరకూ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
కన్నడ , మరాఠి, తమిళ్ లో అప్పుడప్పుడు కొన్ని నేటివిటీ తో సహజమైన సినిమాలోస్తుంటాయి.. అయితే అలాంటి సినిమాలు చూసినప్పుడు మన తెలుగులో కూడా ఇలాంటి సినిమాలోస్తే బాగుంటుదనిపిస్తుంది. అలా మన పాత్రలు, మన నేటివిటీ కలగలిసిన కథతో తెలుగులో వచ్చిన సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. విజయవాడకు చెందిన దర్శకుడు తను చాలా దగ్గరగా చూసిన విశాఖపట్నం సమీపంలో ఉన్న ‘కంచరపాలెం’ అనే ఊరును, వారి ప్రతిభను తెలుగు స్క్రీన్ పై గొప్పగా చూపించాలనుకున్నాడు. ఆ ఊరిలో ఉండే మనుషుల గురించే కాదు.. వారి వృత్తుల గురించి కూడా చూపిస్తూ అలరించాలనుకున్నాడు. అలా అనుకోవడమే కాదు వారి జీవన విధానంతో కూడిన సహజమైన పాత్రలతో, ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చెప్పాడు.
సినిమా ప్రారంభమైన పది నిమిషాల పాటు ప్రేక్షకుడికి కథేంటో.. ఆ పాత్రలేంటో పెద్దగా అర్థం కావు, కనెక్ట్ అవ్వవు.. స్లో స్క్రీన్ ప్లేతో సినిమా ఏదో అలా సాగుతుందనిపిస్తుంది. కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమాలోని పాత్రలు ప్రేక్షకుడిలో పరకాయ ప్రవేశం చేస్తాయి.. అక్కడి నుండి ప్రేక్షకుడు ఆ పాత్రల్లో తనను తాను చూసుకుంటూ కథకి బాగా కనెక్ట్ అయిపోతాడు. ఇక్కడే దర్శకుడి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజానికి ఆ పాత్రలకు అక్కడి స్థానికులను ఎంచుకోవడమనేది దర్శకుడు చేసిన సాహసమే.. ఆ విషయంలో దర్శకుడు వెంకటేష్ ప్రతిభని మెచ్చుకోవాల్సిందే. ఓ ఇద్దరు ముగ్గురు మినహా మిగతా నటీనటులందరూ కంచరపాలెం స్థానికులే. ముఖ్యంగా కథకు కీలకమైన రాజు పాత్రలో సుబ్బారావు నటన సినిమాకే హైలైట్. ఇక సినిమా చూశాక ఒక్కొక్కరూ ఒక్కో క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వడం ఖాయం. అలా అన్ని వయసుల వారికి కనెక్ట్ అయ్యే కథ ఇది.
నిజానికి వెంకటేష్ దర్శకుడిగా కంటే రచయిత గానే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. అతని రచన సినిమా చూస్తున్నంత సేపు మెస్మరైజ్ చేస్తుంది. ఎక్కడా ఈ కథ మనది కాదు కదా ఈ ఊరు మనది కాదు కదా అనే ఫీలింగ్ రాకుండా కనెక్ట్ చేయడం విశేషం. అందుకే అతని రచన దిగ్గజాలను సైతం ఆకట్టుకుంది. మొదటి భాగం కాస్త నెమ్మదిగా నడిపించినప్పటికీ రెండో భాగం మాత్రం వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో అన్ని పాత్రలను ఒక తాటిపైకి తీసుకొచ్చే ఓ ట్విస్ట్ తో ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేసి ఔరా అనిపించాడు. ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ దర్శకుడు చెప్పిన తీరు బాగా ఆకట్టుకుంటుంది.
గతంలో కొందరు దర్శకులు ఇలాంటి కథలతో సినిమాలు చేసినప్పటికీ కేరాఫ్ కంచరపాలెం అంత క్లారిటీగా ఇప్పటివరకు ఇలాంటి కథల్ని ఎవరూ డీల్ చేయలేకపోయారు. ఆ విషయంలో వెంకటేష్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ లో లోపాలున్నప్పటికీ సినిమాలోని పాత్రలు వాటిని మరిచిపోయేలా చేస్తాయి. చివరిగా ఇది అందరూ స్వతహాగా అనుభూతి చెందాల్సిన మంచి సినిమా.
బాటమ్ లైన్ : మన కథ… మన సినిమా
రేటింగ్ : 3.25 / 5
జీ సినిమాలు సౌజన్యంతో...