IFFI Award 2022: మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల వర్షం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు

IFFI Award 2022: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ - 2022 అవార్డుకు ఎంపిక కావడంపై ప్రముఖులు అభినందనలు కురిపిస్తున్నారు. కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందన సందేశం పంపించారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 20, 2022, 11:18 PM IST
IFFI Award 2022: మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల వర్షం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు

గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎఫ్ఐ 53వ ఎడిషన్ సందర్భంగా చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు గెల్చుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరు సాధించిన ఘనతపై సోషల్ మీడియాలో ప్రశంశలు వెల్లువలా కురుస్తున్నాయి. 

మెగాస్టార్ చిరంజీవికి లభించిన అరుదైన గౌరవంపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. చిరంజీవిని అభినందిస్తూ..ప్రత్యేక అభినందన సందేశం పంపించారు. అద్భుతమైన నటనతో అశేషమైన అభిమానులను సొంతం చేసుకుని వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి గారు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ - 2022 అవార్డుకు ఎంపికవడం పట్ల హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు. 

గోవా వేదికగా జరుగుతున్న 53 వ ఐఎఫ్ఎఫ్ఐ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ఈ అవార్డును ఇస్తున్నట్లు ప్రకటించడం అభినందనీయం. 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ నట ప్రస్థానంలో.. 150కి పైగా చిత్రాల్లో  నటించి తెలుగువారితోపాటు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి ఈ అవార్డుకు సరికొత్త వన్నె తీసుకొచ్చారని చెప్పడంలో అతిశయోక్తి లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

పద్మభూషణ్, రఘుపతి వెంకయ్య అవార్డు, పలుమార్లు నంది అవార్డు వంటి అనేక అవార్డులను అందుకున్న చిరంజీవి సినీ అభిమానుల గుండెల్లో మెగాస్టార్‌గా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నటనతోపాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తెరిగి బ్లడ్ బ్యాంక్‌ ఏర్పాటుచేయడం ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలు చేయడం, వారి అభిమానులు ఈ సేవాకార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సహించడం ప్రశంసనీయం.

చిరంజీవికి పవన్ అభినందనలు

మరోవైపు జనసేనాని చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నయ్యకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని.. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రమని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానన్నారు. నాలుగు దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నానని పవన్ కళ్యాణ్ అభినందించారు. 

Also read: IFFI Award: ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు చిరు అర్హుడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News