Karthikeya 2 Hindi Theatres Count Increasing Day By Day: అనేక వాయిదాల తర్వాత శనివారం నాడు విడుదలైన కార్తికేయ 2 సినిమా సూపర్ హిట్ టాక్ తో ముందుకు దూసుకు వెళుతోంది. నిజానికి ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచే విధంగా సినిమా టీజర్, ట్రైలర్ కట్ చేయడంతో సినిమా మీద ప్రేక్షకులు ఒక రేంజ్ లో అంచనాలు పెట్టేసుకున్నారు. అయితే ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగా కార్తికేయ 2 టీం కూడా మ్యాజిక్ చేసింది. ఒక మైథాలజికల్ అడ్వెంచరస్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది. శనివారం మొదటి షో పడిన తర్వాత ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు రావడంతో పాటు విమర్శకులు కూడా సినిమా మీద విమర్శల వర్షం కురిపించకుండా ప్రశంసల వర్షం కురిపించడంతో సినిమాకు బాగా కలిసి వచ్చింది.
దానికి తగ్గట్టుగానే సినిమాకు ఆదివారం ఆ తర్వాత ఆగస్టు 15వ తేదీ సెలవు రోజు కూడా కలిసి వచ్చాయి. ఈ దెబ్బతో కేవలం మౌత్ టాక్ తోనే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో కార్తికేయ 2 థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నాయి. ఆదివారం, సోమవారం కూడా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇక వర్కింగ్ డేస్ అయినా మంగళ, బుధవారాల్లో కూడా ఈ సినిమాకు మంచి బుకింగ్స్ వచ్చాయి. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కార్తికేయ 2 మూడున్నర కోట్లు, రెండో రోజు మూడు కోట్ల 81 లక్షలు, మూడోరోజు నాలుగు కోట్ల 23 లక్షలు వసూలు చేస్తే నాలుగో రోజు వర్కింగ్ డే కావడంతో రెండు కోట్ల పదిహేడు లక్షలు, ఐదో రోజు కోటి 60 లక్షలు వసూళ్లు సాధించింది. ఇక వీక్ డేస్ లో కూడా ఈ మేరకు వసూళ్లు రావడం మామూలు విషయం కాదని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.
అంతేకాక నిఖిల్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక తెలుగు, మలయాళ, కన్నడ వర్షన్స్ కర్ణాటక సహా మిగతా భారత దేశంలో కోటి 23 లక్షలు వసూలు చేస్తే ఓవర్సీస్ లో రెండు కోట్ల 75 లక్షలు వసూలు చేసింది. ఇక నార్త్ ఇండియాలో హిందీ వర్షన్ ఇప్పటివరకు రెండు కోట్ల 20 లక్షల కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఎలాంటి పాన్ ఇండియా హిస్టరీలేని హీరో-డైరెక్టర్ సినిమాకు ఈరెంజ్ వసూళ్లు, అది కూడా నార్త్ లో అంటే అవి గమనించాల్సిన అంశాలు. నిజానికి ఈ సినిమా విడుదల చేసిన 13వ తేదీన హిందీలో 53 షోస్ మాత్రమే సినిమాకు దక్కాయి. తర్వాత రెండో రోజుకు అవి 181 షోలకు పెరిగాయి. అలా మూడో రోజుకు 711, నాలుగో రోజుకు 1228 షోలకు వెళ్లిన ఈ సినిమా ఐదో రోజుకు 1575 కు పైగా షోలతో రన్ అవుతోంది. ఇక త్వరలోనే జన్మాష్టమి ఉండడంతో ఆ రోజు కేవలం ఒక్క హిందీలోనే 2500 నుంచి 3000 వేల షోస్ పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే పలు సినిమాలతో దేశవ్యాప్తంగా సత్తా చాటిన రాజమౌళి సినిమా కాదు, పెద్ద స్టార్లు అంతకన్నా లేరు. అయినా ఈ సినిమాకి హిందీలో కూడా ఇంత క్రేజ్ లభించడానికి కారణం హిందీ ప్రేక్షకులు దేవుళ్లకు సంబంధించిన కథలను ప్రోత్సహిస్తూ ఉండడమే అని అంటున్నారు. గతంలో అఖండ లాంటి సినిమాల విషయంలో కూడా వారు ఆసక్తి చూపించడానికి అదే కారణం అని అంటున్నారు. అంతేకాక బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ కనిపించింది రెండు నిమిషాలు అయినా ఆయన మాట్లాడిన డైలాగ్స్ విన్న తర్వాత రోమాలు నిక్కబడుచుకోకుండా ఉండవు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దానికి తగ్గట్లుగా ఈ సినిమా కోసమే అన్నట్లుగా హిందీలో విడుదలైన లాల్ సింగ్ చద్దా అలాగే రక్షాబంధన్ సినిమాలు దారుణమైన డిజాస్టర్లుగా నిలవడంతో ఆ ధియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆ సినిమా ధియేటర్ల యాజమాన్యాలు ఆ సినిమాలు తీసేసి కార్తికేయ సినిమా వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా థియేటర్ల యాజమాన్యాలను నేరుగా సోషల్ మీడియాలో అడుగుతూ ఉండటం కూడా ఆసక్తిగా మారిపోయింది.
దానికి తోడు ఈ ఏడాది ఇది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాకు సహనిర్మాణ సంస్థగా ఉండడంతో ఆ పరిచయాలు కూడా ఈ సినిమా థియేటర్ల కౌంట్ పెరగడానికి కారణం అయింది. కంటెంట్ ఉన్నోడు ఎవడైనా కింగే అని తెలుగు ప్రేక్షకులు సహా భారతీయ ప్రేక్షకులందరూ కంటెంట్ ఉంటె చిన్నా పెద్దా లేకుండా ఆదరిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకి నార్త్ లో కూడా మంచి స్పందన లభిస్తుంది అని చెప్పక తప్పదు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ పేర్కొన్నట్లుగా పుష్ప కూడా ఇలాగే చాలా సైలెంట్ గా మొదలై నార్త్ లో వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. నిజానికి ఈ సినిమా నిర్మాణ వ్యయం 30 కోట్ల రూపాయల వరకు జరిగింది. అయితే థియేటర్ బిజినెస్ మాత్రం 12 కోట్ల వారు 80 లక్షల వరకే జరిగింది. మిగతా డబ్బులు అన్నీ కూడా శాటిలైట్ అలాగే ఓటీటీ బిజినెస్ లో రాబట్టుకుంది సినిమా యూనిట్. ఇప్పటికే ఈ సినిమా హక్కులను జీ గ్రూప్ కొనుగోలు చేసింది. సాటిలైట్ అలాగే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ కూడా కొనుగోలు చేసింది.
నిజానికి నిఖిల్ నటించిన సినిమాలలో ఇప్పటివరకు ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమా 16 కోట్ల 55 లక్షల షేర్ వసూళ్లతో మొదటి స్థానంలో ఉండేది. అయితే ఇప్పుడు కేవలం ఐదు రోజులకే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒకటిన్నర కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఆయన కెరీర్లో టాప్ గ్రాసర్ గా నిలిచింది. అంతేకాక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ చూసుకుంటే 12 కోట్ల 80 లక్షల రూపాయలు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్ల 30 లక్షలుగా నిర్ణయించారు. ఐదు రోజులకు గాను ఈ సినిమా మూడో రోజే బ్రేక్ వెన్ సాధించి ప్రస్తుతం ఎనిమిది కోట్ల 20 లక్షల రూపాయల లాభాలతో ముందుకు దూసుకు వెళుతోంది. ఇక చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ 2 సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష, ఆదిత్య మీనన్, తులసి, ప్రవీణ్, సత్య, నటుడు శ్రీధర్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల మీద టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెలుగు, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. నిజానికి ఈ సినిమాను తమిళ వర్షన్ థియేటర్లలో విడుదల చేయడం లేదని కేవలం ఓటీటీలో విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి