దేశం గర్వించదగిన ఫిలిం ఎడిటర్ కన్నుమూత !

దేశం గర్వించదగిన ప్రముఖ సినీ ఎడిట‌ర్లలో ఒకరైన టీఆర్ శేఖ‌ర్ గురువారం ఉద‌యం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

Last Updated : Mar 23, 2018, 12:52 AM IST
దేశం గర్వించదగిన ఫిలిం ఎడిటర్ కన్నుమూత !

దేశం గర్వించదగిన ప్రముఖ సినీ ఎడిట‌ర్లలో ఒకరైన టీఆర్ శేఖ‌ర్ గురువారం ఉద‌యం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 81 సంవత్సరాలు. 1980వ దశకంలో దక్షిణాదిన ప్రముఖ ఎడిటర్‌గా పేరు తెచ్చుకున్న టీఆర్ శేఖ‌ర్ దాదాపు 5 దశాబ్ధాలపాటు పలు కమెర్షియల్ హిట్స్, ఆర్ట్ ఫిలింస్‌కి తన సేవలు అందించారు. మళయాళంలో ప్రముఖ దర్శకుడు ఫాజిల్ తెర‌కెక్కించిన చిత్రాల‌న్నింటికీ టీఆర్ శేఖ‌ర్ ఎడిట‌ర్‌గా ప‌ని చేయడం విశేషం. 1978లో మళయాళంలో తొలి సినిమాస్కోప్ ఫిలిం 'తచోలి అంబు'కి ఎడిటర్‌గా పనిచేసిన టీఆర్ శేఖర్, 1982లో దేశంలో తొలి 70ఎంఎం చిత్రంగా పేరొందిన 'పడయట్టం'ను ఎడిట్ చేశారు. అంతేకాకుండా దేశంలో తొలి 3D చిత్రంగా పేరున్న 'మై డియర్ కుట్టిచతన్' (1984) సినిమాను కూడా టీఆర్ శేఖర్ ఎడిట్ చేయడం విశేషం. పూవె పూచూడవా, పూవిజి వాసలిలె, అరంగేట్ర వెల్లై, వరుషం పడినారు, క‌నుక్కుల్‌ నిలవు, క‌ద‌లుక్కు, మ‌రియాదై, కిలిపెచ్చు కెట్కువా, ఎన్ బొమ్మకుట్టి అమ్మవుక్కు చిత్రాలతో టీఆర్ శేఖ‌ర్‌ ఎడిట‌ర్‌గా మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 

టీఆర్ శేఖర్‌ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం 1986లో రాష్ట్ర ప్రభుత్వ అవార్డుతో సత్కరించింది. 1989లో ఏ.ఎం ఫాజిల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన వరుషం పడినారు చిత్రానికిగాను తమిళనాడు సర్కార్ టీఆర్ శేఖర్‌ని రాష్ట్ర ప్రభుత్వ అవార్డుతో సత్కరించింది. టీఆర్ శేఖ‌ర్ అంత్యక్రియ‌లు గురువారం సాయంత్రం 5గం.ల‌కి ట్రిచిలో ముగిశాయి. శేఖ‌ర్ మృతి పట్ల దక్షిణాది సినీ ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు. 

Trending News