మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు "భరత్ అను నేను" అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొరటాల శివ ‘ఫస్ట్ ఓథ్’ పేరుతో ఓ ఆడియో క్లిప్‌ను ట్విట్టర్లో విడుదల చేశారు. అందులో తాను తీస్తున్న సినిమా గురించి పలు ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు. ఆ సినిమా ఒక పొలిటికల్ డ్రామా అని, ఆ సినిమాపై ప్రేక్షకులకు మరింత అవగాహన కల్పించడం కోసం రిపబ్లిక్ డే నాడు ఉదయం 7 గంటలకు ‘ఫస్ట్ ఓథ్’ పేరుతో ఒక ఆడియోను విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ రోజే ఆ ఆడియో విడుదల అయ్యింది. మహేష్ బాబు వాయిస్‌తో విడుదలైన ఆ ఆడియో సారాంశం ఈ విధంగా ఉంది. ‘‘శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అనేది ఆ ప్రమాణ స్వీకార పాఠం సారాంశం. ఆ ఆడియోను బట్టి, బహుశా ఈ చిత్రంలో మహేష్ బాబు సీఎం అవతారంలో కనిపిస్తారేమోనని అనుకుంటున్నారు ఆయన అభిమానులు.