తెలుగులో సినిమా డైరెక్ట్ చేయనున్న రేణు దేశాయ్

రేణు దేశాయ్ 

Updated: Aug 10, 2018, 04:32 PM IST
తెలుగులో సినిమా డైరెక్ట్ చేయనున్న రేణు దేశాయ్
Twitter photo

ప్రముఖ సినీ నటి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలుగులో ఓ సినిమా డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పవన్‌తో విడిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి పూణెకు మకాం మార్చిన రేణు దేశాయ్ అక్కడ మరాఠిలో ఇష్క్ వాలా లవ్ అని ఓ మరాఠి సినిమాను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇష్క్ వాలా లవ్ సినిమాతో దర్శకురాలిగానే కాకుండా నిర్మాతగానూ మారిన ఈ హీరోయిన్ ఆ తర్వాత మంగలాస్టక్ వన్స్ మోర్ అనే మరో సినిమాను కూడా నిర్మించారు. ఈ రెండు చిత్రాలతో వచ్చిన అనుభవంతో ఇక తెలుగులో తానే స్వయంగా ఓ సినిమాను డైరెక్ట్ చేయడంతోపాటు ఆ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు. 

ఇంతకీ రేణు తెరకెక్కించబోయే చిత్ర కథాంశం ఏంటనే కదా మీ డౌట్!! ఆ.. అక్కడికే వస్తున్నాం.. రేణు తన సినిమా కోసం తీసుకున్న కథాంశం రైతుల ఆత్మహత్యలు, రైతన్నల ఇబ్బందులేనట! ఈ సినిమా కథాంశాన్ని మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం కోసం త్వరలోనే ఆమె ఓ గ్రామాన్ని సందర్శించి అక్కడి రైతన్నల ఆవేదనను తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారని సమాచారం.

ఇటీవల రేణు ఓ తెలుగు టీవీ ఛానెల్లో ఓ డ్యాన్స్ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ఆమెతో ముచ్చటించిన చాలామంది మీడియా వాళ్లు, అభిమానులు.. మీరు తెలుగులో సినిమా ఎప్పుడు డైరెక్ట్ చేయబోతున్నారని అడిగారట. అలా వాళ్ల ప్రోద్బలంతోనే రేణు తన తెలుగు సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్‌తో నిశ్చితార్థం జరుపుకుని వార్తల్లోకెక్కిన ఈ హీరోయిన్ ఇప్పుడిలా మరోసారి వార్తల్లోకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.