రజినీకాంత్ ఎంట్రీపై ఏ.ఆర్. రెహ్మాన్ ఏమన్నారు ?

Last Updated : Jan 6, 2018, 06:37 PM IST
రజినీకాంత్ ఎంట్రీపై ఏ.ఆర్. రెహ్మాన్ ఏమన్నారు ?

తమిళనాడు రాష్ట్రానికి బలమైన నాయకత్వం అవసరం అని అభిప్రాయపడ్డారు ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఏ.ఆర్ రెహ్మాన్. తాను సంగీత పరిశ్రమలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పూర్తి చేసుకుంటూ దేశవ్యాప్తంగా లైన్ కన్సర్ట్స్ నిర్వహిస్తున్న ఈ ఆస్కార్ అవార్డ్ విన్నర్.. ఈ నెల 12వ తేదీన చెన్నైలో అక్కడి అభిమానుల ముందు పర్‌ఫామ్ చేయనున్నారు. తమిళనాడుపై తనకి వున్న గౌరవ భావాన్ని చాటుకుంటూ 'నెత్రు ఇంద్రు నాలై' ( నాడు నేడు రేపు) పేరిట నిర్వహించనున్న ఈ లైవ్ కన్సర్ట్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భంగా ఆయనతో ముచ్చటించిన మీడియా మిత్రులు.. తమిళనాట ప్రస్తుత రాజకీయాలు, రాజకీయాల్లోకి రజినీకాంత్ ప్రవేశం లాంటి అంశాలపై స్పందించాల్సిందిగా కోరారు.

మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన ఎ.ఆర్. రెహ్మాన్.. ప్రస్తుతం తమిళనాడు బలమైన నాయకత్వం అవసరం ఎంతైనా వుందని అన్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న రైతుల కష్టాలు తీర్చేవారు, మౌళిక సౌకర్యాల రూప కల్పనకు కృషిచేసేవారు, సంగీతాన్ని, అంతరించిపోతున్న కళలకి ప్రాణం పోసే వారు రాష్ట్రానికి అవసరం. అది రజినీకాంతే కావచ్చు లేక మరెవరైనా కావచ్చు.. కానీ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుండి నడిపించే నాయకత్వం కావాలి అని 'కర్ర విరగకుండా.. పాము చావకుండా' తన అభిప్రాయాన్ని వెల్లడించారు రెహ్మాన్.

Trending News