Waltair Veerayya Review: వాల్తేరు వీరయ్య మూవీ రివ్యూ.. పూనకాలు తెప్పించిన మెగా-మాస్!

Waltair Veerayya Movie Review: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, ఈ సినిమా ఎలా ఉందనేది సినిమా రివ్యూలో చూద్దాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 13, 2023, 08:02 AM IST
Waltair Veerayya Review: వాల్తేరు వీరయ్య మూవీ రివ్యూ.. పూనకాలు తెప్పించిన మెగా-మాస్!

Waltair Veerayya Movie Review: ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈసారి రవితేజతో కలిసి వాల్తేరు వీరయ్య అనే మాస్ మసాలా సబ్జెక్ట్ చేశారు. బాబీ డైరెక్షన్ లో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటించడం, సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ అంతా సినిమా మీద ఆసక్తి పెంచడంతో సినిమా మీద అంచనాలు అంతకంతకు పెరుగుతూ వెళ్లాయి. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది అనేది రివ్యూలో తెలుసుకుందాం.  

వాల్తేరు వీరయ్య కథలోకి వెళితే
విశాఖపట్నం వాల్తేరులోని జాలరి పేటలో ఉండే వాల్తేరు వీరయ్య(మెగాస్టార్ చిరంజీవి) ఆ పేట మొత్తానికి బాస్ లాంటి వాడు. తనకు ఎవరూ లేకపోవడంతో తన పేట వాళ్లే తన వాళ్ళుగా బతుకుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి దగ్గరకు ఒక డ్రగ్స్ డాన్(బాబీ సింహ) చేతిలో తోటి పోలీసులు అందరూ ఊచకోతకు గురవడంతో ఆ డాన్ మీద పగ తీర్చుకోవాలని దాని కోసం ఎంత డబ్బైనా ఇస్తానంటూ సీతాపతి(రాజేంద్ర ప్రసాద్) అనే వ్యక్తి వస్తాడు. ఆ డ్రగ్స్ డాన్ మలేషియాలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వాల్తేరు ‘వీరయ్య అండ్ కో’ని తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వీరయ్య అక్కడి హోటల్ లో పని చేసే అదితి(శృతి హాసన్)తో ప్రేమలో పడతాడు. డ్రగ్స్ డాన్ ను పట్టుకోవడం కాదు తనకు అసలు అతను టార్గెట్ కాదని అతని అన్న మైఖేల్(ప్రకాష్ రాజ్) టార్గెట్ అంటూ సీతాపతికి షాక్ ఇస్తాడు. అసలు విశాఖపట్నం వాల్తేరులోని జాలరి పేటలో నివసించే వీరయ్యకు మలేషియాలో డ్రగ్స్ బిజినెస్ చేసే మైఖేల్  ఎందుకు టార్గెట్ అవుతాడు? అసలు వాల్తేరు వీరయ్య అనాధనా? అతనికి ఎవరూ లేరా? అదితి వీరయ్యకు ఇచ్చిన షాక్ ఏంటి? వాల్తేరు వీరయ్యకు ఏసిపి వివేక్ సాగర్ మధ్య ఏం జరిగింది? అసలు వాల్తేరు వీరయ్య ఎందుకు మైఖేల్ ని టార్గెట్ చేస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
ఈ సినిమా కొత్త కథతో ఏమీ రూపొందించబడలేదు గతంలో మనం ఎన్నో సినిమాల్లో చూసిన కథని మరోసారి మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు బాబీ. సినిమా ఫస్ట్ ఆఫ్ మొదలైనప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి ఎంటర్టైన్మెంట్ తో అందరినీ ఆకట్టుకోగా ఇంటర్వెల్ బ్యాంగ్ తో ప్రేక్షకులందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేశారు. ఇక బాబీ సెకండ్ హాఫ్ లో కూడా తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. సెకండ్ ఆఫ్ లో రవితేజ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా ఊపందుకుంటుంది. మధ్యలో శృతిహాసన్ రా ఆఫీసర్ గా చేసే ఫైట్లు ఆకట్టుకుంటాయి. జాలరి పేటలో ఉండే వీరయ్యకు వివేక్ సాగర్ కు మధ్య బంధుత్వం ఏమిటి? వివేక్ మృతికి వాల్తేరు వీరయ్య ఎలా పగ తీర్చుకున్నాడు? ఇలాంటి విశేషాలు బాబీ తనదైన మార్కుతో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ ఆఫ్ మొత్తం ఆసక్తికరంగా సాగినా సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అందరికీ తెలిసిన కథ అయినా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కలిపి చూపించడంతో కొంతవరకు సినిమా గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కథ కాక పోయినా కామెడీ డాన్స్ ఎమోషన్స్, ఇలా అన్ని యాంగిల్స్ ని సమపాళ్లలో కలిపి ప్రేక్షకులు ముందు ఉంచేందుకు బాబీ చేసిన ప్రయత్నం దాదాపు సఫలం అయిందని చెప్పాలి.

నటీనటులు
నటీనటుల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఆద్యంతం చాలా ఎంటర్టైనింగ్ గా రూపొందించారు. సినిమా ఆద్యంతం చాలా కామిక్ వేలో ఆయన పాత్ర సాగుతూ ఉంటుంది. రవితేజ తెలంగాణ యాసతో పోలీసు ఆఫీసర్ గా ఆకట్టుకున్నాడు. శృతిహాసన్ కూడా రా ఆఫీసర్ గా తనదైన శైలిలో ఫైట్స్ చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ప్రకాష్ రాజ్, బాబీ సింహా, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, ప్రదీప్ రావత్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. ఊర్వశి రౌతేలా డాన్స్ ఆకట్టుకుంది. 

టెక్నికల్ టీం
టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు బాబీ సినిమా మొత్తాన్ని తనదైన మార్క్ లో తెరకెక్కించారు. ఒక అభిమాని తన హీరోని ఎలా చూడాలి? అనుకుంటున్నారో అదే విధంగా చూపిస్తున్నానని ముందు నుంచి చెబుతూ వచ్చిన బాబీ అభిమానులను మాత్రం ఫుల్ ఖుషీ చేశాడు. మెగాస్టార్ చిరంజీవిలోని కామిక్ యాంగిల్ ఆయనలోని యాక్షన్ స్టైల్, ఆయన డాన్స్, ఇలా ప్రతి యాంగిల్ ని వాడుకుంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన అన్ని సాంగ్స్ బాగా విజువల్ ఫీస్ట్ లా అనిపించాయి. బాస్ పార్టీ, పూనకాల లోడింగ్, శ్రీదేవి, అందం ఎక్కువ వంటి పాటలు ఆకట్టుకున్నాయి. ఇక ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ రూపొందించిన హార్బర్ సెట్ అలాగే మరికొన్ని సెట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కోన వెంకట్ డైలాగ్స్ కూడా కొంతవరకు వర్కౌట్ అయ్యాయి. నవీన్, రవిశంకర్ నిర్మాణ విలువలు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.

ఫైనల్ గా ఒక్కమాటలో 
వాల్తేరు వీరయ్య పక్కా కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్టైనర్.. ఫ్యాన్స్ కి మాత్రం పూనకాలు లోడింగ్. 
Rating: 2.75/5

 

Trending News