Wanted Pandugod Movie Review: ‘సునీల్-సుడిగాలి సుధీర్-అనసూయ’లు నటించిన ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ రివ్యూ

Wanted Pandugod Movie Review in Telugu:  సునీల్ ప్రధాన పాత్రలో అనసూయ, సుడిగాలి సుధీర్, విష్ణుప్రియ, దీపికా పిల్లి లాంటి వారు నటించిన వాంటెడ్ పండుగాడ్ సినిమా రివ్యూ మీకోసం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2022, 04:53 PM IST
Wanted Pandugod Movie Review: ‘సునీల్-సుడిగాలి సుధీర్-అనసూయ’లు నటించిన ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ రివ్యూ

Wanted Pandugod Movie Review in Telugu: తెలుగులో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్లు వచ్చి చాలా కాలం అయ్యాయి. ఒకప్పుడు ఈవీవీ  సత్యనారాయణ  చాలా మంది కమెడియన్లతో సినిమాలు చేసి అలరించేవారు. ఆయన తర్వాత అలాంటి సినిమాలు చేసే దర్శకులు కరవయ్యారని చెప్పాలి. అనిల్ రావిపూడి లాంటివారు బడా హీరాలతో కొన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నా సరే అవి కొంతమేరకే వర్కౌట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాఘవేంద్రరావు శిష్యుడు శ్రీధర్ సీపాన ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఒకప్పటి జబర్దస్త్ యాంకర్స్, కమెడియన్స్ అందరినీ నింపేశారు. ప్రధాన పాత్ర సునీల్ పోషించగా బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుదీర్, సప్తగిరి, తనికెళ్ల భరణి, ఆమని, పృద్వి, శ్రీనివాస్ రెడ్డి, అనసూయ భరద్వాజ్, దీపిక పిల్లి వంటి వారితో సినిమా ప్లాన్ చేయడంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచే విధంగా ట్రైలర్, టీజర్ ఉండడంతో సినిమాకు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది అనేది సినిమా రివ్యూలో చూద్దాం.

పండుగాడ్ కథ ఏమిటంటే:
చంచల్ కూడా జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్న పండుగాడ్(సునీల్) అక్కడ పోలీసులను కొట్టి తప్పించుకుని నర్సాపూర్ ఫారెస్ట్ లోకి పారిపోతాడు. నర్సాపూర్ ఫారెస్ట్ లో అతను షెల్టర్ తీసుకుంటున్నాడు అన్న విషయం తెలుసుకుని పోలీస్ శాఖ అతనిని పట్టుకుంటే కోటి రూపాయల నజరానా ప్రకటిస్తుంది. దీంతో అఖిల్ చుక్కనేని(వెన్నెల కిషోర్), అక్రమ్ రాథోడ్(సప్తగిరి), బోయపాటి బాలయ్య(శ్రీనివాస్ రెడ్డి), మణిముత్యం(తనికెళ్ళ భరణి), హాసిని(ఆమని), గాడ్ ఫాదర్(పృథ్వి రాజ్) వంటి వారు అడవి బాట పడతారు. ఒక టీవీ ఛానల్ హెడ్ గా ఉన్న విజయ్ కాంత్(రఘుబాబు) తన దగ్గర రిపోర్టర్లుగా పనిచేసే సుధీర్(సుడిగాలి సుధీర్), ప్రీతి(దీపికా పిల్లి)లను పండుగాడ్ ను ఇంటర్వ్యూ చేసేందుకు పంపిస్తారు. ఎవరికీ ఎవరు సంబంధం లేకుండా అడివిలోకి అడుగుపెట్టిన  వీరంతా కలిసి చివరికి పండుగాడిని చేరుకున్నారా లేదా? పండుగాడు పండుగాడ్ ఎలా అయ్యాడు? పండుగాడ్ ను పట్టుకున్న తరువాత పోలీసులు ప్రకటించిన ఆ కోటి రూపాయలు ఎవరికి దక్కాయి అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:
కొన్నాళ్ల క్రితం తెలుగులో ఉన్న కమెడియన్స్ అందరితో కలిసి ఇలా సినిమాలు చేసేవారు ఈవివి సత్యనారాయణ. అలాంటి సినిమాల్లో ఒకటీ అరా సక్సెస్ అవుతూ ఉండేవి. బహుశా అదే కాన్సెప్ట్ తో ఈ సినిమా చేసినట్లు కనిపిస్తోంది. తెలుగులో కమెడియన్లుగా భావించే సునీల్, సుధీర్, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్, రఘుబాబు, షకలక శంకర్, జబర్దస్త్ రాజు, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ భండారి, హేమ, కరాటే కళ్యాణి, విష్ణు ప్రియ, దీపిక పిల్లి, నిత్యాశెట్టి, బ్రహ్మానందం వంటి వారితో ఈ సినిమా ప్లాన్ చేశారు దర్శకుడు. ఒక పూర్తిస్థాయి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలని అనుకుని జబర్దస్త్ కామెడీతో సినిమా నడిపించడానికి ప్రయత్నించారు. కానీ అది ఏమాత్రం ఆకట్టుకోదు అనే విషయం అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పటికే ఈ మేరకు అనేక ప్రయత్నాలు చేసినా పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి, కానీ అదే కోవలో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాట అటు ఉంచితే ఏ మాత్రం ఎంగేజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదు. కేవలం నవ్వించాలి అనే ప్రయత్నంతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందులో ఏమాత్రం సఫలం కాలేదు. ఇంతమంది క్రేజ్ ఉన్న నటీనటులతో ఇలాంటి సినిమా చేయడం అనేది కాస్త ఇబ్బందికరమైన అంశమే. ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని పట్టుకోవడం కోసం అసలు ఏ మాత్రం బ్యాగ్రౌండ్ లేని వారందరూ కలిసి అడవిలోకి వెళ్లడం అనేది లాజిక్ కి చాలా దూరంగా ఉంటుంది. ఇక ఆయా పాత్రలతో చేయించడానికి ప్రయత్నించిన కామెడీ కూడా ప్రేక్షకులకు ఎబెట్టుగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలయితే అసలు ఎందుకు వస్తున్నాయో? ఎందుకు వెళ్ళిపోతున్నాయో? కూడా అర్థం కాక ఒక రకమైన సందిగ్ధావస్థలో పడిపోతారు ప్రేక్షకులు. ఒక నాలుగైదు సీన్లు మాత్రం నవ్విస్తాయి. 

నటీనటుల విషయానికి వస్తే
ఈ సినిమాలో క్రేజ్ ఉన్న నటినటులు సహా ఈ మధ్యకాలంలో సినిమాల్లో కనిపించని వారు సైతం సినిమాలో కనిపించారు. ఎవరికి వారు తమదైన శైలిలో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే హీరోయిన్ గా ప్రయత్నాలు చేసి ఏమాత్రం లక్కు దక్కించుకొని నిత్య శెట్టి రతి అనే కాస్త గ్లామరస్ రోల్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. అలాగే విష్ణు ప్రియ, దీపిక పిల్లి, అనసూయ వంటి వారు తమ అందాలు ఆరబోసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా వాసంతి కృష్ణన్ అనే నటి కూడా కృతిక అనే పాత్రలో నటించింది. వీరి అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పటిలాగే సునీల్ సహ సుడిగాలి సుదీర్ మొదలు మిగతా తారాగణం అంతా తమ పాత్ర పరిధి మీద నటించి ఆకట్టుకున్నారు అయితే ఏ మాత్రం ఆసక్తి కలిగించని ఈ కథను వీళ్ళందరూ ఎలా ఒప్పుకున్నారా అని ప్రేక్షకులలో అనుమానాలు మాత్రం కలుగుతాయి. అవసరానికి మించి నటీనటులు ఉన్నా ఒక్కరి పాత్రకి కూడా పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదని చెప్పాలి.

టెక్నికల్ టీం విషయానికి వస్తే
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీధర్ సీపాన పూర్తి స్థాయిలో కథ మీద కాకుండా కామెడీ సీన్స్ మీదే దృష్టి పెట్టారు. అయినా సరే అవి కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాకు పెద్దపల్లి రోహిత్ అందించిన లిరిక్స్ గాని సంగీతం గాని ఏ మాత్రం ఆకట్టుకోలేదు. డిఓపి మహి రెడ్డి కొంతమేర తన కెమెరా పనితనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. యష్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ కూడా కొంతమేర సినిమాకు ప్లస్ అయ్యింది. ఎడిటర్ తమ్మిరాజు పనితనం సినిమా మొత్తం మీద కనిపించింది. అవసరం లేని సీన్లు ఎక్కడికి ఎక్కడ తొలగించారు ఆయన. ఇక రాఘవేంద్రరావు సమర్పించిన ఈ సినిమా నిర్మాణ విలువలు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే
వాంటెడ్ పండుగాడ్ సినిమా ఒక పూర్తి స్థాయి రొటీన్ కామెడీ ఎంటర్టైనర్. కామెడీ ఎంటర్టైనర్లు ఇష్టపడే వారు కూడా ఈ సినిమాను అడాప్ట్ చేసుకోలేరు. ఎక్కడికక్కడ నాన్ సింక్ కామెడీ కావడంతో సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. అయితే ఒక వర్గం ప్రేక్షకులకు సినిమాలు నచ్చే అవకాశాలు ఉన్నాయి. జబర్దస్త్ టైపు కామెడీ ఇష్టపడే వారికి సినిమా నచ్చొచ్చు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా టాలీవుడ్ లో ఉన్న కమెడియన్స్ కనిపిస్తున్నారు కదా చూసి వద్దాం అనుకునే వాళ్ళు ఓసారి ఇబ్బందులు లేకుండా వెళ్లి చూసి రావచ్చు.
 

Rating: 1.5/5

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x