రంగస్థలం ఫోజులో అల్లు అర్జున్ కొడుకు..!

రామ్ చరణ్ తేజ, సమంత, అనసూయ ముఖ్య తారాగణంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే "రంగస్థలం". 

Last Updated : Mar 22, 2018, 06:44 PM IST
రంగస్థలం ఫోజులో అల్లు అర్జున్ కొడుకు..!

రామ్ చరణ్ తేజ, సమంత, అనసూయ ముఖ్య తారాగణంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే "రంగస్థలం". ఈ చిత్రంలో మెడ చుట్టూ తువాలు వేసుకొని.. దాన్ని స్టైల్‌గా లాగే రామ్ చరణ్ ఫోజు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఫోజు తెగ నచ్చిందేమో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అయాన్ కూడా అచ్చం అలాంటి మాస్ ఫోజులోనే దర్శనమిచ్చాడు.

ఆ ఫోజులో ఉన్న కొడుకుని చూస్తూ ముచ్చట పడిపోయిన అల్లు అర్జున్.. వెంటనే ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆయన షేర్ చేయగానే నటుడు రానా దగ్గుబాటి కూడా ఆ ఫోటోని షేర్ చేసి.. రంగస్థలం హీరోయిన్ సమంతకు కూడా ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది. లుంగీ కట్టుకొని, బొత్తాలు లేని చొక్కా వేసుకొని చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరు పూర్తి స్థాయి మాస్ లుక్ ఇస్తుంటే.. తాను మాత్రం తక్కువ తిన్నానా అన్న టైపులో అదే స్థాయి ఫోజు అయాన్ ఇవ్వడం గమనార్హం. 

మైత్రి మూవీ మేకర్స్ బ్యానరుపై నవీన్ యర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న "రంగస్థలం" చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పంపిణీ చేస్తోంది. దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రంలోని పాటలన్నీ చంద్రబోసు రాశారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, అమిత్ శర్మ, నరేష్, రోహిణి, బ్రహ్మాజీ, గౌతమి, పూజా హెగ్డే ఈ చిత్రంలో ఇతర తారాగణం. దాదాపు 50 కోట్ల రూపాయల పెట్టుబడితో పూర్తిస్థాయి గ్రామీణ వాతావరణంలో తెరకెక్కించిన ఈ చిత్రం 30 మార్చి 2018 తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Trending News