భారతదేశంలో క్రికెట్ బెట్టింగ్ లాంటి వాటికి చట్టబద్ధత కల్పించాలని.. ఆ రకంగా చేయడం వల్ల చాటు మాటుగా జరిగే పలు ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని న్యాయ కమీషన్ ఎదుట ప్రతిపాదనను పెట్టిన కేంద్ర న్యాయశాఖ అభిమతాన్ని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.
అదే గనుక జరిగితే.. దేశంలో ఉన్న ప్రతీ కిళ్లీ కొట్టు కూడా జూదశాలగా మారిపోతుందని.. అలాగే క్రీడల్లోని బెట్టింగ్ లాంటి అనైతిక కార్యకలాపాలకు ప్రభుత్వమే లైసెన్స్ ఇస్తే.. క్రీడా ప్రమాణాలు తగ్గి.. ఆ రంగానికి ఉన్న విలువ పూర్తిగా పోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారి మీడియాకి తెలిపారు.
ఇలాంటి చెడు ఆలోచనలు బీజేపీ చేస్తే తాము చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు. అయితే, ప్రపంచంలో అనేక దేశాలు బెట్టింగ్ క్రీడకు చట్టబద్ధత కల్పించడంతో భారత్ కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని యోచిస్తున్నాట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో కేంద్రం ఈ విషయంపై పునరాలోచన చేయాలని కాంగ్రెస్ తెలిపింది. బెట్టింగ్ క్రీడ నిర్వహించే సంస్థలు పన్ను చెల్లించే విధంగా.. లైసెన్స్ ప్రక్రియలు పకడ్బందీగా నిర్వహించే విధంగా చూస్తూ.. అలాగే ఈ రంగంలోకి విదేశీ పెట్టుబడులు కూడా ఆహ్వానిస్తూ ఒక పారదర్శకమైన పద్ధతికి శ్రీకారం చుట్టాలని కేంద్రం ఆలోచన చేస్తుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.
అందుకు గాను చట్టంలో పలు మార్పులు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్‌కు పాల్పడే వినియోగదారులు కచ్చితంగా తమ ఆధార్, పాన్ కార్డు వివరాలు ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు లింక్ చేసేలా చూడడానికి కూడా కేంద్రం పథకం రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి చట్టాలను తాము అనైతికమైనవిగానే చూస్తామని.. కేంద్రం ఇలాంటి ఆలోచనలను మానుకోవాలని కాంగ్రెస్ తెలిపింది.