టాలీవుడ్ ప్రముఖ హస్య నటుడు, హీరో సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయన అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇవాళ తెల్లవారుజామున సునీల్ కు అకస్మాత్తుగా కడుపులో నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు సునీల్ అస్వస్థతకు గురి కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
రేపు ‘డిస్కో రాజా’ విడుదల
సునీల్ తాజాగా నటించిన హీరో రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సునీల్ అస్వస్థతకు గురి కావడంతో చిత్రం యూనిట్ కూడా ఆందోళనలో ఉంది. హాస్య నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సునీల్.. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ సినిమాతో హీరోగా హిట్టు కొట్టారు. ఐతే ఆదిలో హీరోగా మంచి విజయాల్ని అందుకున్న సునీల్.. తరువాత ఆశించిన ఫలితాలు పొందలేకపోయారు. దీంతో మళ్లీ పంథా మార్చుకుని.. తిరిగి హాస్య నటుడిగా అవతారమెత్తారు.
విలన్ పాత్రలో సునీల్
మరోవైపు హీరోగా, కమెడియన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్న సునీల్.. తాజాగా ప్రతినాయుకుడి పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యారు. త్వరలో సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కలర్ ఫోటో' అనే సినిమాలో సునీల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..