బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా పేరు వాడుకొని.. హోటల్‌లో తిష్టవేయడానికి ప్రయత్నించిన ఓ అమ్మాయిపై రాజస్థాన్ పోలీసులు సెక్షన్ 420 క్రింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ భాంద్రా ప్రాంతంలోని ఓ హోటల్‌లో జరిగిన ఈవెంట్‌లో పాల్గొనడానికి హీరోయిన్ ఊర్వశి రౌతేలా రావాల్సి ఉంది. అయితే ఆమె వచ్చేలోపే.. ఎవరో అమ్మాయి హోటల్‌లోకి వచ్చి తానే హీరోయిన్‌నని హోటల్ సిబ్బందిని నమ్మించే ప్రయత్నం చేసింది.
తొలుత నమ్మకపోయినా.. తర్వాత ఆధార్ కార్డు చూపించడంతో ఆ అమ్మాయే హీరోయిన్ అని నమ్మి.. రూమ్ బుక్ చేయించి.. తాళాలు చేతిలో పెట్టారు సిబ్బంది. అలా హీరోయిన్ గడపాల్సిన రూమ్‌లోకి వెళ్లిన ఆ అమ్మాయి.. దాదాపు నాలుగు గంటలు అదే గదిలో గడిపింది. తర్వాత నిజంగానే హీరోయిన్ ఆ హోటల్‌కి వచ్చినా సిబ్బందినమ్మే పరిస్థితిలో లేకపోవడంతో కథ అడ్డం తిరిగింది.
ఈవెంట్ నిర్వాహకులు వచ్చి అసలైన హీరోయిన్ ఎవరో చెప్పడంతో నాలిక కరచుకున్నారు హోటల్ సిబ్బంది. అయితే అప్పటికే హీరోయిన్ పేరు వాడుకున్న అమ్మాయి హోటల్ గది ఖాళీ చేసి వెళ్లిపోవడం గమనార్హం.
తర్వాత ఇదే విషయమై హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి సీసీటీవీ ఫుటేజీలు సేకరించి ఎట్టకేలకు హోటల్‌లో ఉన్న అమ్మాయి పేరు పారుల్ చౌదరి అని.. ఆమె ఒక మోడల్ అని తేల్చారు. అయితే హీరోయిన్ ఊర్వశి రౌతేలా పేరు వాడుకున్నందుకు.. ఆమె ఆధార్ కార్డును డూప్లికేటు తయారుచేసి హోటల్‌లో ఇచ్చినందుకు ఆ మోడల్ పై ఐపీసీ సెక్షన్ 420 క్రింద కేసు నమోదు చేశారు.