రజనీకాంత్ నటించిన "కాలా" చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులో రంగరంగవైభవంగా జరిగింది. ఈ ఫంక్షన్‌లో రజనీకాంత్ తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని.. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లేవాడినని ఆయన అన్నారు. అలాగే తాను అమితంగా గౌరవించే వ్యక్తుల్లో దాసరి నారాయణరావు కూడా ఒకరని.. ఆయనను కూడా చాలా మిస్సవుతున్నానని రజనీకాంత్ అన్నారు.
దాసరి తనను కన్నబిడ్డలా ఆదరించేవారని రజనీ చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. "అంతు లేని కథ"తో తనకు తెలుగులో సినీ కెరీర్ ప్రారంభమైనా.. అతి పెద్ద హిట్ ఇచ్చిన వ్యక్తి మోహన్ బాబు అని.. ఆయన బ్యానర్‌లో తాను నటించిన "పెదరాయుడు" చిత్రం సూపర్ హిట్ అయ్యిందని రజనీ గుర్తుచేసుకున్నారు.
అలాగే ఇదే ఫంక్షన్‌లో రజనీకాంత్ అల్లుడు ధనుష్ "రజనీకాంత్ ఒక్కరే సూపర్ స్టార్" అని అర్థం వచ్చేలా మాట్లాడితే దానికి కూడా ఆయన సమాధానమిచ్చారు. "ఒక్కరే రజనీ కాదు.. ఒకే చిరంజీవి.. ఒకే బాలకృష్ణ.. ఒకే నాగార్జున.. ఒకే వెంకటేశ్.. ఇలా అందరూ ఒక్కొక్కరే ఉంటారు. ఎవరి ప్రాధాన్యం వారిది. ఎవరూ గొప్ప కాదు. అవకాశాలే గొప్ప.
వాటిని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం. కొందరు ఇలా సద్వినియోగం చేసుకోవడాన్ని లక్ అంటారు... దేవుడి మీద నమ్మకం ఉన్నవారు ఆయన ఆశీర్వాదం అంటారు" అని తెలిపారు రజనీకాంత్. కష్టపడే వారికి ఫలితం తప్పకుండా దొరుకుతుందని.. ఇందులో డౌట్ లేదని ఆయన పేర్కొన్నారు. తాను తొలిసారిగా తెలుగు చిత్రంలో నటించినా.. తన గురువు బాలచందర్ సూచన మేరకే తమిళ చిత్రాలు చేశానని.. తనపై తమిళులు ఎంత ప్రేమ చూపిస్తున్నారో.. తెలుగువారు కూడా అంతే ప్రేమ చూపిస్తారని.. అది తన భాగ్యమని అన్నారు రజనీకాంత్.
రజనీకాంత్ నటించిన "కాలా" చిత్రం ఈ నెల 7వ తేదిన విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నానా పటేకర్‌తో పాటు హ్యుమా ఖురేషీ కూడా నటించారు. అలాగే రజనీకాంత్ సతీమణి పాత్రలో ఈశ్వరిరావు నటించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధనుష్ నిర్మిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ పంపిణీ చేస్తోంది.