'ఎన్టీఆర్' చిత్రంలో రానా ఫస్ట్ లుక్ విడుదల

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’.

Updated: Sep 12, 2018, 04:29 PM IST
'ఎన్టీఆర్' చిత్రంలో రానా ఫస్ట్ లుక్ విడుదల

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది.

ఇటీవలే ఎన్టీఆర్‌ అల్లుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న రానా దగ్గుబాటి లుక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలు చూస్తుంటే.. రానా అచ్చం చంద్రబాబులాగే కన్పించారని అభిమానులు, నెటిజన్లు చెప్పారు.

అయితే ఈ మూవీలో రానా పోషిస్తున్న చంద్రబాబు నాయుడి పాత్ర లుక్‌ని చిత్ర యూనిట్ వినాయక చవితి సందర్భంగా ఈ రోజు  అధికారికంగా విడుద‌ల చేసింది. 1984లో చంద్రబాబు నాయుడు అంటూ.. ఈ లుక్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు రానా. ఈ లుక్‌ని మీరూ చూడండి..

 

వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా  'ఎన్టీఆర్‌' చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ రెడీ చేస్తున్న చిత్ర యూనిట్ భావిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనుంది. ఇటీవలే బసవతారకం పాత్రలో నటిస్తున్న విద్యాబాలన్, ఇతర నటీనటులపై కొన్ని షాట్స్ చిత్రీకరించగా.. మిగిలిన పాత్ర‌ల షూటింగ్ ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న‌ది. హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నివాసంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

‘ఎన్టీఆర్' బయోపిక్ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో సుమంత్, సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌లు నటించనున్నట్లు సమాచారం.