సాహో మూవీ నిర్మాతలు మోసం చేశారని ఫిర్యాదు

సాహో మూవీ నిర్మాతలు మోసం చేశారని ఫిర్యాదు 

Last Updated : Oct 18, 2019, 04:25 PM IST
సాహో మూవీ నిర్మాతలు మోసం చేశారని ఫిర్యాదు

మాదాపూర్‌: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌, బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్‌ జంటగా నటించిన సాహో సినిమా అంచనాలపరంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేశాడు. అయితే, ఈ సినిమా నిర్మాతలపై తాజాగా బెంగళూరుకు చెందిన ఔట్‌షైని ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తరఫున తమ బ్రాండ్‌కు సంబంధించి ఆర్క్‌టిక్‌ ఫాక్స్‌ పేరును సినిమా మధ్యలో చూపిస్తామని ఒప్పందం కుదుర్చుకొని రూ.37 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆ సంస్థలో మార్కెటింగ్‌ హెడ్‌గా పనిచేస్తున్న విజయ్‌రావు గురువారం మాదాపూర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. 

మాదాపూర్ సీఐ వెంకట్‌ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం సాహో సినిమా నిర్మాతలు వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డితోపాటు సెలబ్రిటీ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సీఈఓ హిమాంద్‌ దువ్వూరు సినిమాలో భాగంగా తమ సంస్థ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని మోసం చేశారని విజయ్‌ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

సాహో నిర్మాతలు బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తారని చెప్పడంతో మధ్యవర్తికి రూ. 1.49 లక్షలు చెల్లించినట్టు విజయ్ రావు పోలీసుల ఎదుట వాపోయాడు. ఔట్‌‌షైని ఇండియా కంపెనీ నుంచి హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో బ్రాడ్‌కాస్టింగ్‌ చేసుకోవడానికి కోటి రూపాయలు పెట్టుబడి కూడా పెట్టామని.. అయితే, చివరకు తమ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సినిమాలో తమ బ్రాండ్‌ను చూపించలేదని విజయ్‌ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది.

Trending News