శ్రీదేవి ఆకస్మిక మృతి పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి

తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి మరణవార్తను విన్న టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

Last Updated : Feb 25, 2018, 12:27 PM IST
శ్రీదేవి ఆకస్మిక మృతి పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి

తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి మరణవార్తను విన్న టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమెతో కలిసి పనిచేసిన దర్శకులు, సహనటులు శ్రీదేవి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.

* ‘అసమానమైన అభినయ ప్రతిభతో శ్రీదేవి భారత ప్రేక్షక లోకం అభిమానాన్ని చూరగొన్నారు. శ్రీదేవి ఇక లేరు అనే మాట నమ్మలేనిది. కానీ ఆమె వెండితెరపై పోషించిన భిన్నమైన పాత్రలన్నీ చిరస్మరణీయాలే. భౌతికంగా ఈ లోకాన్ని వీడినా నటిగా శ్రీదేవి ముద్ర చిత్ర సీమలో సుస్థిరం. శ్రీదేవి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే మానసిక స్థైర్యాన్ని భగవంతుడు అందించాలని ప్రార్థిస్తున్నాను’ - పవన్ కళ్యాణ్

'శ్రీదేవి గారు చనిపోయారన్న వార్త విన్న తర్వాత కొద్దిసేపటి వరకు షాక్‌లోనే ఉన్నాను. ఆ తర్వాత నాకు గుర్తుకొచ్చిన మొదటి వ్యక్తి రాంగోపాల్‌వర్మ. ఆయనలా ఆమెను ఎవరూ అభిమానించలేదంటే నమ్మశక్యం కాదు. ఆయన అంతలా కాకపోయినా మేమూ శ్రీదేవి గారి అభిమానులమే. మా తరంలో ఆమెను అభిమానించని వ్యక్తి ఎవరూ లేరనే చెప్పొచ్చు. ఏదేమైనా శ్రీదేవి లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకు లోటే’ -శివాజీరాజా, మా అధ్యక్షుడు

* 'శ్రీదేవి మృతి నన్ను తీవ్రంగా కలిచివేసింది. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ మొదలుపెట్టినప్పటి నుంచీ శ్రీదేవితో పరిచయం ఉంది. పదహారేళ్ల వయసు సినిమా నుంచి జగదేకవీరుడు అతిలోక సుందరి వరకు సినిమా తనతో చాలా సినిమాలు తీశాను. శ్రీదేవి చిత్ర పరిశ్రమలో శ్రీదేవి స్వయంకృషితో ఎదిగారు. ఆమె మృతి సినీరంగానికి తీరనిలోటు' - సీనియర్‌ దర్శకుడు కె.రాఘవేంద్రరావు

* 'ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఉండే శ్రీదేవి చనిపోవడం నమ్మలేకపోతున్నా.షాక్ నుంచి కోలుకోలేకపోతున్నా. దేవుడు కొన్నిసార్లు ఇలాంటి మంచి వ్యక్తులను తీసుకెళ్లిపోతుంటాడు. శ్రీదేవి అద్భుతమైన నటి. ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించగల సత్తా శ్రీదేవిది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి' - సీనియర్‌ దర్శకుడు కోదండరామిరెడ్డి

* 'ఆమె వచ్చింది.. ఆమె చూసింది. ఆమె అందరినీ తన వశం చేసుకుంది. తను ఎక్కడినుంచైతే వచ్చిందో ఆ స్వర్గానికే తిరిగి వెళ్లిపోయింది. శ్రీదేవిగారి ఆత్మకు శాంతి కలగాలి. ఆమె లేని లోటు పూడ్చలేనిది' - జూనియర్ ఎన్టీఆర్

* 'బాలనటిగా ఎంతో పేరు తెచ్చుకున్న శ్రీదేవి హీరోయినా అగ్రస్థానానికి ఎదిగినా.. అంతే ఒద్దికగా ఉండేవారు. సిన్సియారిటీ, నిబద్దతకు మారుపేరు. శ్రీదేవి కళ్లతో అన్ని భావాలను పలికించిన గొప్ప నటి. తెల్లవారకముందే ఆమె మరణవార్తతో అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యా. అంతటి మహా మనిషి ఏ లోకంలో ఉన్నా... ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' -ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్

* ‘శ్రీదేవి చనిపోవడం చాలా బాధాకరం. ఆమె కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలి’- వెంకటేశ్‌

* ‘శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలి’ - నాగార్జున

* 'శ్రీదేవి గారి మరణవార్త షాకయ్యాను. నా అభిమాన నటి వెళ్ళిపోయింది. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆమె కుటుంబానికి ధైర్యాన్ని  ప్రసాదించాలి'- మహేష్ బాబు

* ‘చిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటు. శ్రీదేవి గారు చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.’ - రవితేజ

* ‘ఇది నిజం కాకూడదని అనుకుంటున్నాను. శ్రీదేవి గారు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం’ - నితిన్‌

* ‘శ్రీదేవి చనిపోయారని తెలిసి షాకయ్యాను. ఆమె కుటుంబం ధైర్యంగా ఉండాలి’- నాగబాబు

* 'శ్రీదేవి అందం, అభినయంతో అందరినీ అలరించారు. ముంబయి వెళ్లినప్పుడల్లా శ్రీదేవి కుటుంబంతో మాట్లాడేవాడిని. ఆమె చిన్నప్పటి నుంచి చాలా ఆరోగ్యంగా ఉండేవారు'. -సినీ నిర్మాత సి.అశ్వనీదత్‌

* 'శ్రీదేవి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. బాలనటి తెరంగేట్రం చేసినప్పటి నుంచీ నాకు తను తెలుసు. అందరితోనూ ఎంతో చలాకీగా ఉండేది' - చంద్రమోహన్‌

* 'టీనేజ్‌ నుంచి గొప్ప నటిగా ఎదిగిన శ్రీదేవిని చూశాను. స్టార్‌డమ్‌కు ఆమె అర్హురాలే. ఆమె చనిపోయిందని తెలియగానే ఆఖరిసారి నేను శ్రీదేవిని కలిసిన జ్ఞాపకాలన్నీ ఒక్కసారి నా కళ్ల ముందు మెదిలాయి. ‘సద్మా’ చిత్రంలోని లాలిపాట ఇంకా వినపడుతూనే ఉంది. మనం శ్రీదేవిని చాలా మిస్సవుతాం’- కమల్‌హాసన్‌

* ‘శ్రీదేవి చనిపోయారని తెలిసి చాలా షాకయ్యాను. ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయాను. చిత్ర పరిశ్రమ గొప్ప నటిని కోల్పోయింది. శ్రీదేవి కుటుంబం ఎంత బాధపడుతోందో నేనూ అంతే బాధపడుతున్నాను’- రజనీకాంత్‌

* ‘మాటలు కూడా రావడం లేదు’- సుమంత్‌

* ‘తప్పు చేశావ్‌ దేవుడా..ఆమెది చిన్న వయసే.’- సుధీర్‌ బాబు

* ‘షాకింగ్. చాలా అంటే చాలా త్వరగా వెళ్లిపోయారు. బాధాకరం’- అను ఇమ్మాన్యుయేల్‌

* ‘బాధగా ఉంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’- రాశీ ఖన్నా

* ‘శ్రీదేవి మరణవార్త విని గుండె పగిలిపోయింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె కుటుంబం ధైర్యంగా ఉండాలి’- రమ్యకృష్ణ

* హీరోయిన్లందరికీ శ్రీదేవి ఒక డ్రీమ్ గర్ల్, ఒక ఇన్స్పిరేషన్. ఆమెలా అత్యున్నత స్థాయికి ఎదగాలని మేమంతా ఆశపడినవారమే. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' - రోజా

* ‘నాకెంతో ఇష్టమైన నటి శ్రీదేవి చనిపోయారంటే నమ్మలేకపోతున్నాను. జీర్ణించుకోలేకపోతున్నాను’- కాజల్ అగర్వాల్‌

*'ఈ భయంకరమైన వార్త విని గుండె పగిలినంత పనైంది. శ్రీదేవి లాంటి ఒక గొప్ప నటి తన అభినయంతోనూ అందంతోనూ ఇతురలతో కలిసిమెలిసి పనిచేయడాన్ని చూడటం తనకు లభించిన ఓ గౌరవము'- శ్రుతిహాసన్

Trending News