హిందీ చిత్ర పరిశ్రమలో కూడా తెలుగు నటులు చాలామంది తమ లక్ పరీక్షించుకున్నారు. తెలుగు హీరోలు నటించిన పలు హిందీ చిత్రాలు అక్కడ కూడా సూపర్ హిట్ అవ్వగా.. పలు సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. అయితే.. ఇప్పటికీ అడపా దడపా హిందీ చిత్రాలలో నటించే తెలుగు హీరోలు కొందరు ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో పాగా వేయడానికి తెలుగు కథానాయకులు చేస్తున్న ప్రయత్నాల్లో ఎన్ని సక్సెస్ బాట పట్టాయో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవాల్సిందే. బాలీవుడ్‌లో హీరోలుగా నటించిన తెలుగు నటుల గురించి ఈ ఆర్టికల్ మీకోసం ప్రత్యేకం..!
నందమూరి తారకరామారావు: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు 1956లో "నయా ఆద్మీ" అనే పేరుగల బాలీవుడ్ చిత్రంలో నటించారు. సిపి దీక్షిత్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని పాట "గరీభోంకా పసీనా బెహ్ రహా హై" అప్పట్లో బాగా పాపులర్ అయిన ప్రజాగీతంగా చెప్పుకోవచ్చు. అంజలీదేవి ఈ చిత్రంలో కథానాయికగా నటించగా హెలన్, అన్వర్ వంటి హిందీ నటులు కూడా ఈ చిత్రంలో నటించారు.
అక్కినేని నాగేశ్వర రావు: అక్కినేని తెలుగులో నటించిన "సువర్ణ సుందరి" చిత్రం 1958లో కూడా అదే పేరుతో విడుదలైంది. అంజలీ దేవి ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. హిందీ చిత్రానికి కూడా తెలుగు దర్శకుడు వేదాంతం రాఘవయ్యే దర్శకత్వం వహించారు.
చిరంజీవి - మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి హిందీ చిత్రం "ప్రతిబంధ్" 1990లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. తెలుగు చిత్రం "అంకుశం"కు ఇది రీమేక్. ఈ చిత్రం తర్వాత ఆజ్ కా గుండా రాజ్, ది జెంటిల్ మేన్ వంటి హిందీ చిత్రాలలో కూడా చిరంజీవి నటించారు.
వెంకటేష్ - విక్టరీ వెంకటేష్ నటించిన "అనారి" చిత్రం 1993లో విడుదలైంది. కరిష్మా కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. తెలుగు చిత్రం "చంటి"కి ఈ చిత్రం రీమేక్. ఈ చిత్రం తర్వాత "యమలీల" చిత్రం రీమేక్ అయిన "తక్ దీర్ వాలా" చిత్రంలో కూడా వెంకటేష్ నటించారు.
నాగార్జున - అక్కినేని నాగార్జున నటించిన తొలి హిందీ చిత్రం "శివ" 1990లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో బాలీవుడ్‌లో విడుదలై సక్సెస్ నమోదు చేసింది. ఈ చిత్రం తర్వాత పలు హిందీ చిత్రాలలో నటించారు నాగార్జున. అందులో ఖుదాగవా, క్రిమినల్, జక్మ్, మిస్టర్ బేచారా, అగ్ని వర్ష, ఎల్ ఓ సీ కార్గిల్ చిత్రాలు ప్రముఖమైనవి.
హరీష్ - తెలుగు నటుడు హరీష్ నటించిన తొలి చిత్రం "జిల్ జాకి" 1986లో హిందీలో విడుదలైంది. ఆ తర్వాత ఆయన నటించిన "ప్రేమఖైదీ" చిత్రం హిందీలో సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో వచ్చిన "ప్రేమ్ ఖైదీ" చిత్రానికి అది రీమేక్. ఆ తర్వాత ఓ 30 చిత్రాల వరకు ఆయన హిందీలో నటించారు. అందులో అనేక చిత్రాలలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు.
రామ్ చరణ్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన "జంజీర్" చిత్రం 2013లో విడుదలైంది. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించారు.
నితిన్ - రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన "అగ్యాత్" హిందీ చిత్రంలో తొలిసారిగా తెలుగు నటుడు నితిన్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో ప్రియాంక కొఠారి హీరోయిన్‌గా నటించగా.. శ్రీలంక అడవుల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. ఇదే చిత్రాన్ని తెలుగులో "అడవి" పేరుతో విడుదల చేశారు.
చక్రవర్తి - రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెలుగు నటుడు చక్రవర్తి "సత్య" అనే హిందీ చిత్రంలో నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యాక దుర్గ, వాస్తుశాస్త్ర లాంటి చిత్రాలలో కూడా చక్రవర్తి హీరోగా నటించారు.
రానా దగ్గుబాటి - తెలుగు నటుడు రానా దగ్గుబాటి 2011లో హిందీ చిత్రం "దమ్ మారో దమ్" సినిమాతో బాలీవుడ్‌లో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత డిపార్ట్ మెంట్, బేబీ వంటి హిందీ చిత్రాలలో కూడా నటించారు. ఆయన నటించిన "హాథీ మేరే సాథీ" ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.