దళితుడి ఇంటిలో ఆతిథ్యం స్వీకరించిన మంత్రి.. వివాదంలో ఎందుకు చిక్కుకున్నారు..?

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ అధినేత సురేష్ రానా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన "దళితవాడల సందర్శన" పథకంలో భాగంగా ఓ ఇంటికి వెళ్తానని.. ఆ ఇంట్లోనే భోజనం చేస్తానని తెలిపారు.

Last Updated : May 3, 2018, 01:49 PM IST
దళితుడి ఇంటిలో ఆతిథ్యం స్వీకరించిన మంత్రి.. వివాదంలో ఎందుకు చిక్కుకున్నారు..?

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత సురేష్ రానా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన "దళితవాడల సందర్శన" పథకంలో భాగంగా ఓ ఇంటికి వెళ్తానని.. ఆ ఇంట్లోనే భోజనం చేస్తానని తెలిపారు. అలా ఆయన చెప్పిన విధంగానే రజనీష్ కుమార్ అనే ఓ దళిత పౌరుడి ఇంటికి వెళ్లారు. అయితే ఆయన ఆ ఇంటి భోజనం చేయలేదు సరికదా.. ఆ ఇంటికి సంబంధించి పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదని పలువురు అంటున్నారు.

ఒక ప్లాన్ ప్రకారం ఆయన ఆ ఇంటికి చేరే ముందే స్థానిక హోటల్ నుండి ఫుడ్ ఆర్డరిచ్చారని.. ఆ ఇంట్లోకి వెళ్లాక అదే భోజనం చేశారని..ఆయనతో పాటు వెళ్లిన పలువురు కార్యకర్తలే చెప్పడం గమనార్హం. రజనీష్ ఇంటిని సందర్శించక ముందే మంత్రి రాకను పురస్కరించుకొని ఓ ప్రముఖ హోటల్ నుండి పాలక్ పన్నీర్, పులావ్, గులాబ్ జామున్, రాజ్మా, దాల్ తడ్కా, తందూరి రోటీ, సలాడ్, రైతా, మినరల్ వాటర్ ఆర్డరిచ్చారని తెలుస్తోంది.

ముందస్తు పథకం ప్రకారమే ఇవ్వన్నీ ఆర్డర్ ఇచ్చి.. ఆ తర్వాత మంత్రి దళిత సోదరుల ఇంటికి వెళ్లి భోజనం చేస్తే ఏమిటి? చేయకపోతే ఏంటి అని పలువురు పెదవి విరవగా.. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారంగా మంత్రి కొట్టిపారేశారు. తను వస్తున్నట్లు సదరు దళిత కుటుంబానికి ముందుగానే తెలుసు కాబట్టి.. ఈ విషయాన్ని వివాదం చేయవద్దని ఆయన తెలిపారు.

అలీగఢ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సురేష్ రానా చేసిన పనిపై పలు దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇష్టం లేకపోతే దళితుల ఇళ్ళకు రావడం మానేయాలని.. అంతేగానీ ఆయన ఇలా ప్రవర్తించడం అంటే దళితులను అవమానించడమేనని  పలు సంఘాలు ఆరోపించాయి

Trending News