పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆదివారం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లా బాలాకోట్ వద్ద పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. పాక్ రేంజర్ల కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరణించినవారిని మహ్మద్ రంజాన్, మల్కా బి, ఫైజాన్, రిజ్వాన్, మెహ్రెన్‌గా గుర్తించారు.
'పూంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్‌లో దాడుల కారణంగా ఐదుగురు పౌరులు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలిస్తున్నాము' అని జమ్ము కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఎస్పీ వైద్ తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
#WATCH: Pakistan violates ceasefire in Balakote sector. #JammuAndKashmir (earlier visuals) pic.twitter.com/02lvon6MkM
— ANI (@ANI) March 18, 2018
వారం రోజుల క్రితం మార్చి 8న పూంఛ్ సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. గత నెలలో, భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనల సంఖ్య పెరగడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. "ఈ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి 2,474 కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయి" అని కాంగ్రెస్ ప్రతినిధి ప్రమోద్ తివారీ పేర్కొన్నారు.