Tamilnadu: ప్రతి వ్యవస్థలో కూరుకుపోయిన జాడ్యం అవినీతి. కుమ్మక్కు రాజకీయాలు, అవినీతి ఫలితంగా అక్షరాలా 25 కోట్ల ఆస్థిని ప్రభుత్వమే కూల్చేయాల్సిన పరిస్థితి. ఆశ్చర్యంగా ఉందా. నిజం మరి.
తమిళనాడులో(Tamilnadu) గత రెండ్రోజుల్లో జరిగిన ఇటువంటి ఘటన మరెక్కడా జరిగుండదు. నిలువెత్తు అవినీతి, నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. అవినీతి కారణంగా ప్రాణాలకే ముప్పు ఏర్పడిన నేపధ్యంలో తీసుకున్న నిర్ణయమది. ఫలితంగా 25 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం. పూర్తిగా నీళ్లపాలు. అంతులేని అవినీతి, కుమ్మక్కు రాజకీయాల ఫలితంగా నిర్మించిన ఏడాదికే ఆ ఆనకట్టకు గంతలు పడ్డాయి. భారీ వర్షాలకు డ్యాం కూలిపోయే పరిస్థితి నెలకొంది. అదే జరిగితే గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోతాయి. వందలాది ప్రాణాలు నీళ్లలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే చేసేది లేక..తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వమై ఆ ఆనకట్టను బాంబులతో కూల్చేయాల్సి వచ్చింది.
దక్షిణ పెన్నా నదిపై( South Penna River) విళుపురం జిల్లా దళవానూరు గ్రామం, కడలూరు జిల్లా ఎలదిరి మంగళూరు గ్రామాల మధ్యన అన్నాడీఎంకే (AIADMK Government)ప్రభుత్వం 25.35 కోట్లతో ఆనకట్ట నిర్మించింది. 2020 సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఈ ఆనకట్ట నాలుగు నెలలలకే అంటే 2021 జనవరి 23వ తేదీన దెబ్బతింది. క్రస్ట్ గేట్లకు దన్నుగా ఇరువైపులా నిర్మించిన గోడ పాక్షికంగా తెగిపోయింది. ఫలితంగా నీరు లీక్ కావడం ప్రారంభమైంది. తాజాగా భారీ వర్షాలతో మరింతగా దెబ్బతిని..ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి తలెత్తింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల దక్షిణ పెన్నానదిలో వరద ప్రవాహం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆనకట్ట పూర్తిగా నిండిపోయి వరదనీరు రెండువైపుల ఒడ్డును తాకడం మొదలైంది. ఇన్‌ఫ్లో అంతకంతకూ పెరిగింది. ఆనకట్టలోని మూడు క్రస్ట్ గేట్లు బలహీన దశకు చేరుకుని ఏ క్షణమైన బద్దలయ్యే పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ఆనకట్టలోకి నీటి ప్రవాహాన్ని ఇసుకబస్తాలు వేసి నిలువరించేందుకు ఈనెల 10వ తేదీన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రవాహ ఒత్తిడిని తట్టుకోలేక ఆనకట్ట ఎడమవైపు తెగిపోగా ఉధృతంగా ప్రవహించిన నీటిలో స్థానికంగా సాగు చేసిన చెరకు పంట కొట్టుకుపోయింది. మరోవైపు ఈనెల 11వ తేదీన అనకట్ట ప్రహరీగోడ బీటలు వారింది.
దీంతో పొంచి ఉన్న ముంపు ముప్పును దృష్టిలో ఉంచుకుని గ్రామాల్ని కాపాడేందుకు ఆనకట్టను ప్రభుత్వ అధికారులే (Dam Blasts)బాంబులు పెట్టి కూల్చేశారు. వాస్తవానికి ఈ ఏడాది ప్రభుత్వం మారిన తరువాత 15 కోట్లతో మరమ్మత్తు పనులు చేయాలని అంచనాలు సిద్ధమయ్యాయి. కానీ వరద ప్రవాహం పెరగడంతో ఆ పనులు జరగలేదు. దాంతో ఆనకట్టను పేల్చేయాలని నిర్ణయించుకున్నారు. మూడు క్రస్ట్ గేట్లను, తీరంలోని కాంక్రీట్ గోడను వంద జిలెటిన్ స్టిక్స్ , వంద తూటాల్ని 20 చోట్ల అమర్చి పేల్చేశారు.
Also read: India to America: ఇక అగ్రరాజ్యానికి నేరుగా నాన్‌స్టాప్ ఫ్లైట్ సర్వీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook