ఆధార్ కార్డు.. దేశంలో ఎక్కడైనా అడ్రస్ ప్రూఫ్ కోసం చెల్లుబాటయ్యే ప్రధానమైన ఐడి కార్డుల్లో ఆధార్ కూడా ఒకటి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మీరు దేశంలో ఎక్కడ నివసిస్తున్నా... మీ ప్రస్తుత చిరునామాపైకి ఆధార్ కార్డును కూడా సులువుగా మార్చుకోవచ్చనే విషయం చాలామందికి అవగాహన లేదు. అంటే మీరు స్థిర నివాసం ఉండే చోట ఆధార్ కార్డు తీసుకున్నప్పటికీ.. ఆ తర్వాత చదువు, ఉద్యోగరీత్యా మరో చోటుకి వెళ్లాల్సి వస్తే.. మీ ఆధార్ కార్డుపై మీరు కొత్తగా వెళ్లిన తాత్కాలిక అడ్రస్‌ను మార్చుకోవచ్చు. అయితే, అందుకు మళ్లీ ఏదైనా కొత్త అడ్రస్ ప్రూఫ్ జత చేయాల్సిందేగా అనే సందేహం మీకు రావొచ్చేమో.. కానీ భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం మీరు ఉంటున్న చోట మీ పేరుపై ఎటువంటి చిరునామా లేకున్నా.. ఆధార్ కార్డుపై మీరు మీ చిరునామాను మార్చుకోవచ్చు.
అవును.. మీరు చదివింది నిజమే. అయితే, అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ అధికారిక వెబ్‌సైట్ http://www.uidai.gov.in or https://resident.uidai.gov.in పై ఆధార్ అప్‌డేట్ సెక్షన్ కింద రిక్వెస్ట్ ఆధార్ వ్యాలిడేషన్ లెటర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ (ఎస్ఎస్‌యూపి) విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఆధార్ కార్డు.. మీ ప్రస్తుత చిరునామా వివరాలను ఓపికగా పొందుపరుస్తు కొన్ని వివరాలు సమర్పించాలి. అనంతరం పలు ఎస్ఎంఎస్, ఓటీపిల రూపంలో మీ రిజిష్టర్స్ మొబైల్ నెంబర్‌కి ఓ సీక్రెట్ కోడ్ వస్తుంది. అదే సమయంలో మీ రిక్వెస్ట్ వెరిఫయర్‌కి సైతం వెళ్తుంది. తద్వారా మీ దరఖాస్తును వెరిఫయర్ ధృవీకరించుకునేందుకు వీలుంటుంది.
అలా దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన అనంతరం భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ మీకు 0000/00XXX/XXXXX రూపంలో ఓ అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ (URN) జారీచేస్తుంది. ఆ యూఆర్ఎన్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవడం ద్వారా మీ ఆధార్ కార్డుపై అడ్రస్ అప్‌డేట్ అయ్యిందా లేదా అనే విషయాన్ని మీరే నేరుగా తెలుసుకోవచ్చు.