'కరోనా వైరస్' మహమ్మారిపై ధీటుగా పోరాడేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఐతే కరోనా మహమ్మారి ఇప్పటి వరకు లొంగలేదు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల కారణంగా సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
లాక్ డౌన్ పొడగింపు కోసం అన్ని రాష్ట్రాలు కోరుతున్న వేళ.. ప్రధాని ఏం చెప్పనున్నారనేది అంతటా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు 21 రోజుల పాటు లాక్ డౌన్ పకడ్బందీగా నిర్వహించారు. ఐతే కరోనా వైరస్ లొంగలేదు కాబట్టి .. లాక్ డౌన్ పొడగిస్తారనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఒడిశా, పంజాబ్, తెలంగాణ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు లాక్ డౌన్ పొడగించనున్నట్లు ప్రకటించాయి.
కానీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక వ్యవస్థ కుంటుపడింది. ఈ క్రమంలో ధరల పెరుగుదల ప్రారంభమైంది. నిత్యావసరాలు సహా ఇప్పుడు అన్నింటి ధరలు కొండెక్కి కూర్చునే పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజులు లాక్ డౌన్ పొడగిస్తే ఇబ్బందులు తప్పవు. అటు కరోనా మహమ్మారి లొంగి రావడం లేదు. దీంతో జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని ఏం చెబుతారనే దానిపై ఆసక్తి నెలకొంది.
మరో రెండు వారాలు పొడగింపునకే ప్రధాని నరేంద్ర మోదీ మొగ్గు చూపే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఐతే ఇప్పటి వరకు నిత్యావసరాలు, వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తుల వంటి వాటిని ఆంక్షలతో కొనసాగిస్తున్నారు. ఇక ముందు కూడా అంటే మరో రెండు వారాలపాటు పాక్షికంగా ఆంక్షలు కొనసాగిస్తూనే లాక్ డౌన్ అమలు చేయాలని ప్రధాని మోదీ చెప్పే అవకాశం ఉంది. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఉపయోగపడే నిర్ణయాన్ని ఆయన ప్రకటిస్తారని చెబుతున్నారు. పారిశ్రామిక రంగాన్ని కూడా పరిమిత ఆంక్షలతో నడిపించాలని ఆయన ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక దూరం పాటిస్తూ .. తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలని సూచించవచ్చు.
మరోవైపు ప్రజా రవాణా వ్యవస్థలో ఎప్పటిలాగే లాక్ డౌన్ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. రైళ్లు, విమానాలు, బస్సుల రాకపోకలకు సంబంధించి లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడగించనున్నట్లు తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడగింపేనా..?