మిత్రపక్షాల వేటలో బీజేపీ; సీట్ల సర్దుబాటుపై నితీష్ తో అమిత్ షా చర్చలు

Updated: Jul 12, 2018, 03:33 PM IST
మిత్రపక్షాల వేటలో బీజేపీ; సీట్ల సర్దుబాటుపై నితీష్ తో అమిత్ షా చర్చలు

మిత్రపక్షాలను కూడగట్టేందుకు దేశ వ్యాప్త పర్యటనలు చేస్తున్న అమిత్ షా ఇప్పుడు బీహార్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం బీహార్ సీఎం నితీష్ కుమార్ తో అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  2019  ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. జేడీయూ, బీజేపీల మధ్య సంబంధాలు కొంచెం బలహీనమయ్యాయనే వార్తలు వస్తున్న తరుణంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 

ఈ రోజు రాత్రి జేడీయూ-బీజేపీ విందు సమావేశం కూడా జరగనుంది. ఈ భేటీ కంటే ముందు బీహార్ బీజేపీ నేతలతో భేటీ అయి సీట్ల సర్దుబాటు అంశంపై పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితిపై  అమిత్ షా సమీక్షించనున్నారు. 

ఇటీవలే ఆర్జేడీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో సీట్ల పంపకాలకు సంబంధించి ఇరు పార్టీల మధ్య అగాధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నితీష్  తో అమిత్ షా సమావేశమయ్యారు