విభజించు-పాలించు అనే సూత్రాన్ని బీజేపీని అమలు చేస్తోంది: మమతా బెనర్జీ

కేంద్రంలో ఉన్న బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు.

Last Updated : Jul 30, 2018, 04:13 PM IST
విభజించు-పాలించు అనే సూత్రాన్ని బీజేపీని అమలు చేస్తోంది: మమతా బెనర్జీ

కేంద్రంలో ఉన్న బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. అస్సాంలో లక్షలాది మందికి పౌరసత్వం ఇవ్వకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జాబితా వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. మైనార్టీలను వేరుచేసేలా విభజించు-పాలించు అనే సూత్రాన్ని బీజేపీ అమలు చేస్తోందని ధ్వజమెత్తారు.

ఆధార్‌, పాస్‌పోర్టు ఉన్నప్పటికీ పౌరసత్వం ఇవ్వలేదని.. సర్ నేమ్స్ ఆధారంగా కూడా కొందరి పేర్లను తొలిగించారని మమతా ఆరోపించారు. ప్రభుత్వం బలవంతంగా తొలిగింపు చేయాలని ప్రయత్నిస్తోందా? అని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రంలోనూ బయటి వ్యక్తులు నివసిస్తున్నారన్నారు. 'నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ (ఎన్‌ఆర్‌సీ)' జాబితాలో పౌరసత్వం లేని ఈ 40 లక్షల మంది ఎక్కడ ఉంటారు? వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్రం ఉందా? అంతిమంగా ఈ సమస్య  బెంగాల్ మెడకే చుట్టుకుంటుంది. కేంద్ర హోం మంత్రి ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా' అని అన్నారు. కేంద్రం మైనారిటీలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని మమత ఆరోపించారు.

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగింది: కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

అస్సాంలో ఎన్‌ఆర్‌సీ జాబితా విడుదలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపి సౌగతా రాయ్‌ లోక్‌సభలో ఎన్‌ఆర్‌సీపై చర్చ కోసం వాయిదా తీర్మానం ఇచ్చి.. జాబితాలో 40 లక్షల మంది పేర్లు లేకపోవడంపై చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. అస్సాంలో ఎన్‌ఆర్‌సీ కార్యక్రమం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిందని తెలిపారు. ఇందులో కేంద్రం ఏ మాత్రం జోక్యం చేసుకోలేదని.. ఇటువంటి సున్నితమైన అంశాలను ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం సరికాదని లోక్‌సభలో వివరించారు.

Trending News