Atal Bihari Vajpayee: రాజకీయాలలో భీష్మ పితామహుడు.. ఆ రికార్డు సాధించిన ఏకైక ఎంపీ.. అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి స్పెషల్

Atal Bihari Vajpayee Jayanti Special: భారత రాజకీయాలలో భీష్మ పితామహుడిగా పేరు తెచ్చుకుని.. ఆరు దశాబ్దాలు పాటు దేశ సేవకే అంకితమైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి నేడు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నేతలు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 08:52 AM IST
Atal Bihari Vajpayee: రాజకీయాలలో భీష్మ పితామహుడు.. ఆ రికార్డు సాధించిన ఏకైక ఎంపీ.. అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి స్పెషల్

Atal Bihari Vajpayee Jayanti Special: రాజకీయాలు చేసే వారు చాలా మంది ఉన్నారు కానీ.. సుపరిపాలన అందించే మహానుభావుల సంఖ్య చాలా తక్కువ. సుపరిపాలన ప్రస్తావన వచ్చినప్పుడు మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు. భారత రాజకీయాలకు మార్గదర్శకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి నేడు. ఆరు దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో ఆయన పేరు మరవలేనిది. తన దూరదృష్టి, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో దేశంతో పాటు అంతర్జాతీయ వేదికలపై చెరగని ముద్ర వేశారు. ఆయన జాతీయ ఆసక్తి ఎప్పుడూ పార్టీ రాజకీయాల కంటే ఎక్కువగా ఉండేది. ఆదివారం ఆయన జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంబురాలు జరుగుతున్నాయి.

47 ఏళ్లపాటు పార్లమెంటేరియన్‌గా..

అటల్ బిహారీ వాజ్‌పేయి 1924 డిసెంబర్ 25న గ్వాలియర్‌లో జన్మించారు. విక్టోరియా కళాశాల (లక్ష్మీబాయి కళాశాల) నుంచి పట్టభద్రుడయ్యారు. కాన్పూర్‌లోని దయానంద్ ఆంగ్లో-వేద కళాశాల నుంచి రాజకీయ శాస్త్రంలో ఎంఏ చేశారు. 1957లో ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌ నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ తరువాత 47 ఏళ్లపాటు పార్లమెంటేరియన్‌గా దేశానికి సేవలందించారు. లోక్‌సభకు 10 సార్లు, రాజ్యసభకు 2 సార్లు ఎన్నికయ్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో.. 1975లో ఎమర్జెన్సీ సమయంలో జైలుకు కూడా వెళ్లారు.

ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయ కార్యకలాపాలపై ఆసక్తి పెంచుకున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. రాజకీయాల్లోకి రాకముందు అటల్ జీ కూడా కొద్ది కాలం జర్నలిజం చేశారు. ఈ సమయంలో ఆయన రాష్ట్రధర్మ, పాంచ్యజన్య, స్వదేశ్, వీర్-అర్జున్ పత్రికలకు సంపాదకుడి వ్యవహరించారు. వాజ్‌పేయి తన విద్యార్థి జీవితంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన జీవితాంతం స్వచ్ఛంద సేవకుడిగా కొనసాగారు.

జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుడిగా..

శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ నుంచి రాజకీయాలను అభ్యసించిన అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనసంఘ్‌లో క్రియాశీల సభ్యుడు. 1951లో జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఆయన 1968 నుంచి 1973 వరకు అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అటల్ జీ 1955 నుంచి 1977 వరకు జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు. 1957లో జనసంఘ్ టికెట్‌పై బలరాంపూర్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు వాజ్‌పేయి మాట్లాడే కళ గురించి ప్రజలకు తెలుసు. ఆయన ప్రసంగంలోని మాయాజాలం అలాంటిది అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తొలిసారిగా పార్లమెంటులో మాట్లాడిన వాజ్‌పేయిని విని.. ఈ కుర్రాడి నాలుకపై సరస్వతి కూర్చున్నదని పొగిడారు. 

4 రాష్ట్రాల నుంచి లోక్‌సభకు..

నాలుగు వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎన్నికల్లో గెలిచి లోక్‌సభకు చేరిన ఘనత అటల్ బిహారీ వాజ్‌పేయి భారత రాజకీయాలలో ఏకైక నాయకుడు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. మధ్యప్రదేశ్‌లోని బలరాంపూర్ స్థానం నుంచి రెండుసార్లు (1957, 1967) ఎన్నికల్లో గెలుపొందారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నుంచి ఒకసారి (1971) ఎన్నికల్లో గెలిచారు. 1977, 1980లలో న్యూఢిల్లీ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో గెలిచి లోక్‌సభకు చేరుకున్నాడు. అటల్ జీ లక్నో నుంచి వరుసగా ఐదుసార్లు (1991, 1996, 1998, 1999, 2004) ఎన్నికల్లో విజయం సాధించారు. 1996లో అటల్‌జీ లక్నోతో పాటు గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి గెలిచారు.

రాజకీయాల్లో ఓటములు..

1957లో బలరాంపూర్‌తో పాటు మధుర, లక్నో స్థానాల నుంచి కూడా పోటీ చేశారు. అయితే బల్‌రామ్‌పూర్‌లో మాత్రం విజయం సాధించారు. అటల్ జీ 1962లో జరిగిన మూడవ లోక్‌సభ ఎన్నికల్లో లక్, బల్‌రామ్‌పూర్‌ పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కానీ ఏ సీటు కూడా గెలవలేకపోయారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో గ్వాలియర్ స్థానం నుంచి ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. 1989లో ఎన్నికల్లో పోటీ చేయలేదు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి మధ్యప్రదేశ్‌లోని విదిశ, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో రెండింటిలోనూ విజయం సాధించారు. అయితే తర్వాత లక్నోను తన నియోజకవర్గంగా కొనసాగించారు. 1996లో జరిగిన 11వ లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీనగర్, యూపీలోని లక్నో రెండింటిలోనూ అటల్ జీ విజయం సాధించారు. అయినప్పటికీ లక్నో పార్లమెంటరీ నియోజకవర్గంపై అతని ప్రేమ చెక్కుచెదరలేదు. 

బీజేపీ స్థాపన ఇలా..

ఓర్పు, సంయమనంతో కూడిన శ్రమపై అటల్ బిహారీ వాజ్‌పేయి పూర్తి విశ్వాసం ఉండేది. 1980లో జనతా పార్టీ విడిపోయిన తర్వాత.. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, కొంతమంది సహచరులతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. బీజేపీ తొలి జాతీయ అధ్యక్షుడయ్యారు. అటల్ 1980 నుంచి 1986 వరకు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. అటల్‌జీ నాయకత్వంలో బీజేపీ నెమ్మదిగా తన సంస్థను బలోపేతం చేయడం ప్రారంభించింది. 1984 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అటల్‌జీ దృష్టి మరల్చకుండా పార్టీని బలోపేతం చేస్తూనే ఉన్నారు. 1984లో కేవలం రెండే సీట్లు గెలుచుకున్న పార్టీ 1989 ఎన్నికల్లో 85 సీట్లు గెలుచుకుని భారత ప్రజాస్వామ్యంలో బీజేపీ బలమైన ఉనికిని నమోదు చేయడం ఆయన వ్యక్తిత్వం, ప్రజాకర్షక నాయకత్వ ఫలితమే. అలాగే సంవత్సరాల తర్వాత, భారత ప్రజాస్వామ్యంలో కొత్త, బలమైన ప్రత్యామ్నాయానికి పునాది పడింది.  

1996లో ప్రధానిగా.. 

1996 లోక్‌సభ ఎన్నికల్లో 161 సీట్లు గెలుచుకుని బీజేపీ తొలిసారిగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్‌జీ తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. ఈ ప్రభుత్వానికి కేవలం 13 రోజులే అధికారంలో ఉండే అవకాశం వచ్చిందన్నది వేరే విషయం. 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయిపై దేశ ప్రజలు మరోసారి విశ్వాసం నింపగా.. 182 సీట్లు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్ జీ దేశానికి రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన నేతృత్వంలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం 13 నెలల పాటు  అధికారంలో ఉంది. 1999లో జరిగిన 13వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుని వరుసగా మూడోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఎన్నికల తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి తన 5 సంవత్సరాల ప్రధానమంత్రి పదవీకాలాన్ని పూర్తి చేసే అవకాశం వచ్చింది. వాజ్‌పేయి 1999 నుంచి మే 13, 2004 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం తొలిసారిగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన ఏకైక వ్యక్తి అటల్ జీ మాత్రమే.

అటల్ బిహారీ వాజ్‌పేయిను ప్రత్యర్థి పార్టీల నేతల మదిలో కూడా ఎంతో గౌరవం ఉండేది. అందుకే ఆయనను రాజకీయ అజాతశత్రవుగా అభివర్ణిస్తారు. మార్చి 2008లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో అటల్‌జీని భారత రాజకీయాలలో భీష్మ పితామహుడు అని పిలిచారు. రాబోయే తరాలు అనేక శతాబ్దాల పాటు ఈ రాజకీయ మార్గదర్శకుడి నుంచి స్ఫూర్తిని పొందుతూనే ఉంటాయి. రాబోయే తరాలు అనేక శతాబ్దాల పాటు ఈ రాజకీయ మార్గదర్శకుడి నుండి స్ఫూర్తిని పొందుతూనే ఉంటాయి. రచయిత, కవి అయిన అటల్ బిహారీ వాజ్‌పేయికు 1992లో పద్మవిభూషణ్‌, 2015లో భారతరత్న అవార్డులు లభించాయి. 16 ఆగస్టు 2018న 93 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికారు.

Also Read: Chalapathi Rao: చలపతి రావు జీవితమంతా విషాదాలే.. ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నారట!

Also Read: NPS Calculation: ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టండి.. పదవీ విరమణపై నేరుగా రూ.కోటి పొందండి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News