గుజరాత్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ బీజేపీ నేత ఒకరు స్వయాన తమ పార్టీపైనే విమర్శలు కురిపించారు. ఈ ఎన్నికల ఫలితాల సమయంలో కాంగ్రెస్, బీజేపీకి గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజ్యసభ ఎంపీ మరియు బీజేపీ నేతైన సంజయ్ కాకడే శనివారం మాట్లాడుతూ ' బీజేపీ అధికారంలోకి వచ్చి చాలా కాలమైన తరుణంలో..అనుభవాన్ని పెంచుకున్న ప్రతిపక్షం నుంచి మంచి పోటీనే ఎదుర్కొంటుంది.
అదేవిధంగా, ముస్లిం జనాభా కూడా మా పార్టీకి వ్యతిరేకత కనబరచే అవకాశం ఉన్నందున.. అది కాంగ్రెస్ విజయానికి దోహదపడవచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రధాని అయ్యాక, గుజరాత్ రాష్ట్రం గురించి కాస్త తక్కువగానే పట్టించుకున్నారని చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూపించినంత చొరవ ఆ తర్వాత రాష్ట్రంపై చూపించలేదు.
అదేవిధంగా, ఒకవేళ కాంగ్రెస్ కలిస్తే.. అది కచ్చితంగా మా ప్రచారలోపంగానే పరిగణించాలి' అని అభిప్రాయపడ్డారు. అయితే కాకడే అభిప్రాయాలతో తాము ఏకీభవించలేమని.. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారంలోకి వస్తాయని కరాకండిగా చెప్పాయని పలువురు బీజేపీ నేతలు అంటున్నారు.