కర్ణాటక శాసనసభలో బలపరీక్షకు ముందే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేశారు. అవసరమైన సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో బీజేపీ అధిష్ఠానం ఆయనను రాజీనామా చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రాజీనామాకు ముందు అసెంబ్లీలో యడ్యూరప్ప మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ ఉన్నా నిధులు అందించి రాష్ట్ర ఉన్నతికి తోడ్పడిందని అన్నారు.
తాను సైతం జీవితంలో ఎన్నో కష్టనష్టాలు చూశానని... ఇలాంటి ఘటనలు తనకు మూమూలేనని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల సంఖ్యపై స్పష్టత రాకపోవడం వల్లే ఆయన రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి.
40 సీట్ల నుంచి 104 సీట్లకు ఎదగడం ద్వారా ప్రజలు తమకే పట్టం కట్టారని చెప్పిన యడ్యూరప్ప.. ప్రజాస్వామ్యంపై తన పార్టీకి ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. యడ్యూరప్ప ప్రసంగం పూర్తి భావోద్వేగంతో సాగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.