స్మార్ట్ ఫోన్ యుగంలో ల్యాండ్ లైన్ ఫోన్ కు కాలం చెల్లిందంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే స్మార్ట్ మొబైల్ కు ధీటుగా ల్యాండ్ లైన్ లో సరికొత్త ఫీచర్సు రూపొదిద్దుకుంటున్నాయి. ఈ ప్రయోగానికి తెరదీసింది బీఎస్ఎస్ఎల్. దీనికి గురించి తెలుసుకోవాంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..
సరికొత్త ఆవిష్కరణ
బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆవిష్కరణకు తెరదీసింది. సరికొత్త ఫీచర్స్ కల్గిన ల్యాండ్ లైన్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. తాజా ఫీచర్స్ ను అనుసరించి ఇక నుంచి ల్యాండ్ ఫోన్ నుంచి కూడా ఎస్ఎంఎస్ లు పంపుకోవచ్చు..వీడియో కాల్స్ చేసుకోవచ్చు.. రింగ్ టోన్స్ సెట్ చేసుకోవచ్చు. అలాగే ల్యాండ్ లైన్ ఫోన్ ను మొబైల్ ఫోన్ కు అనుసంధానించుకోవచ్చు. ల్యాండ్ లైన్ కు వచ్చిన కాల్స్ ను మొబైల్ నుంచే మాట్లాడుకోవచ్చు. దీంతో ల్యాండ్ లైన్ ఫోన్ కు దూరంగా వెళ్లినా కాల్స్ ను స్వీకరించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మార్పులకు శ్రీకారం చుట్టింది బీఎస్ఎన్ఎల్. ఈ సదుపాయాల కోసం ఐపీ ఫోన్ కు అప్ గ్రేడ్ కావాల్సి ఉంటుంది.
ప్రయోగాత్మక దశలో
ప్రయోగాత్మకంగా రాజస్థాన్ లోని బుండి జిల్లాలో టెలికం ఎక్సేంజీల్లో అత్యాధునిక టెక్నాలజీని ప్రవేశపెడుతోంది. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. మరికొన్ని రోజుల్లో పనులు పూర్తవుతాయని..వెంటనే దీన్ని అమలు చేస్తామని బుండి టెలికం జిల్లా అధికారి తెలిపారు. జనాల్లో ల్యాండ్ లైన్ ఫోన్ల పట్ల ఆసక్తి తగ్గిపోవడంతో మళ్లీ వాటిని ఆకర్షణీయంగా మార్చేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు నడుం బిగించింది.