కసాయి పనులు చేసే కాంగ్రెస్ నేతలు.. గోశాలలు నిర్మిస్తారా: బీజేపీ నేత

  

Last Updated : Nov 11, 2018, 12:05 PM IST
కసాయి పనులు చేసే కాంగ్రెస్ నేతలు.. గోశాలలు నిర్మిస్తారా: బీజేపీ నేత

మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర శర్మ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై పలు ఆరోపణలుచేశారు. ఆయన కాంగ్రెస్ నేతలను కసాయి పనులు చేసే వారిగా పేర్కొన్నారు. "కాంగ్రెస్ వాళ్లు ప్రతీ గ్రామపంచాయతీలో గోసంరక్షణ కోసం గోశాలలు నిర్మిస్తామని చెబుతున్నారు. వారు గోవులను ఆరాధించే వారిగా మాట్లాడుతుండడం బాగుంది. కానీ కేరళలో మాత్రం ఈ కాంగ్రెస్ వాళ్లే కెమెరాలకు ఫోజులిచ్చి మరీ గోవధ చేస్తుంటారు. కానీ ఈ రోజు ఓట్ల కోసం గోరక్షకుల ముసుగు కప్పుకొని వస్తున్నారు. ఇంత మోసగాళ్ళను నేను ఎప్పుడూ చూడలేదు" ఆని ఆయన తెలిపారు.

ఇటీవలే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ "వచన్ పత్ర" పేరుతో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. ఈ 112  పేజీల మేనిఫెస్టోలో రాష్ట్రంలో హిందువుల కోసం ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు సంస్కృత భాష వికాసం కోసం ప్రత్యేక నిధిని సమకూర్చనున్నట్లు పేర్కొంది. అలాగే రాష్ట్రంలో "రామ్ పథ్"గా భావిస్తున్న ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది  చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ తెలిపింది. "రామ్ పథ్"గా భావించే చోటులోనే సీతారాములు వనవాసం నిమిత్తం గడిపారన్నది మధ్యప్రదేశ్ ప్రజల విశ్వాసమని.. వారి విశ్వాసాన్ని గౌరవించి ఆ ప్రాంతాన్ని సంరక్షిస్తామని కాంగ్రెస్ తెలిపింది. 

అలాగే గోమూత్రం, గోమయంతో తయారుచేసే పానీయాలు, పిడకలు మొదలైనవాటిని ప్రభుత్వ సంస్థలచే మార్కెటింగ్ చేయిస్తామని కూడా కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయితీలో గోశాలలు నిర్మించి గోవులను పరిరక్షిస్తామని కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టోలో తెలిపారు. అలాగే నర్మదా నదిని పరిరక్షించేందుకు, నర్మదా నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు రూ.1000 కోట్ల నిధిని కూడా కేటాయిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొనడం గమనార్హం.

Trending News