న్యూ ఢిల్లీ: దేశంలో చాలా రోజులుగా పెరుగుతున్న ఉల్లి ధరలపై లోకసభలో కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లీమ్ లీగ్ వాయిదా తీర్మానం ఇచ్చాయి. గత కొన్ని రోజులుగా దేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లక్నోలో పౌరులకు తమ వంతు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు 40 రూపాయలకే ఒక కిలో చొప్పున ఉల్లిగడ్డ విక్రయించి తమ నిరసన తెలియజేశారు. ఇదే విషయంపై చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ పెరుగుతున్న ఉల్లి ధరలపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పెరుగుతున్న ఉల్లి ధరల అంశం ప్రజల అత్యవసర అంశంగా పరిగణించి చర్చకు అనుమతివ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.
ఇదిలావుంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఉల్లిగడ్డల మాల ధరించి పెరుగుతున్న ఉల్లి ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఉల్లిగడ్డల ధరల పెరుగుదల వెనుక కేంద్ర ప్రభుత్వం భారీ కుంభకోణం దాగి ఉందని సంజయ్ సింగ్ ఆరోపించారు.