న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు జరపడంపై చైనా స్పందిస్తూ.. భారత్, పాకిస్థాన్‌లు సంయమనం పాటించాలని శాంతిమంత్రం జపించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ బీజింగ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాసియాలో ప్రధాన దేశాలైన భారత్, పాకిస్థాన్‌లు పరస్పర సంబంధాలు మెరుగుపర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు స్పష్టంచేశారు. దక్షిణాయాసిలో శాంతి, సుస్థిరతకు భారత్, పాకిస్తాన్ పాటుపడాలని ఈ సందర్భంగా లు కాంగ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరాటం అనేది అంతర్జాతీయ విధానం అని చెబుతూ ఉగ్రవాదంపై పోరులో అన్నిదేశాల సహకారం తప్పనిసరి' అని లూ కాంగ్ అభిప్రాయపడ్డారు.
భారత్-పాకిస్తాన్ మధ్య చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలను ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రపంచదేశాలకు చూపించి, అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌ను దోషిగా నిలబెట్టి ఏకాకిని చేయాలని భారత్ ప్రయత్నిస్తుండగా మరోవైపు భారత్ సైతం ఉల్లంఘనలకు పాల్పడుతోందని నిరూపించాలని పాక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు సైతం భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఓ కంట కనిపెడుతూ వస్తున్నాయి.