చెన్నై: చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చెన్నైలో ఘన స్వాగతం లభించింది. చెన్నై ఎయిర్ పోర్ట్ లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సహా పలువురు అధికారులు జిన్ పింగ్‌కు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. మేళతాళాలతో, ఆకట్టుకునే నృత్యరీతులను ప్రదర్శిస్తూ జిన్ పింగ్‌కి స్వాగతం పలికిన తీరు ఆకట్టుకుంది. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఐటీసీ గ్రాండ్ చోళకు వెళ్లిన జిన్ పింగ్ అక్కడే విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4 గంటల మామళ్లపురం (మహాబలిపురం) వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జిన్ పింగ్‌కు ఘనస్వాగతం పలికారు. తమిళనాడు సంప్రదాయం ఉట్టిపడేలా మోదీ ధరించిన పంచెకట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహాబలిపురంలోని చారిత్రక కట్టడాలను, సముద్రం ఒడ్డున ఉన్న ఆలయాన్ని మోదీ, జిన్ పింగ్ ఇద్దరూ కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చారిత్రక కట్టడాలను, సంస్కృతి, సంప్రదాయాలను జిన్ పింగ్‌కు ప్రధాని మోదీ వివరించారు.
Tamil Nadu: Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping at the Shore Temple in Mahabalipuram. pic.twitter.com/uEh2oxEuNk
— ANI (@ANI) October 11, 2019
జిన్ పింగ్ గౌరవార్థం శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ ఆయనకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో పసందైన భారతీయ వంటకాలను వడ్డించనున్నారు. శనివారం మామళ్లపురంలో ఫిషర్మెన్ కోవ్ రిసార్టులో ఇరు దేశాధినేతలు కలిసి వాణిజ్యం,అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. దాదాపు 6గంటలపాటు మోదీ, జిన్ పింగ్ చర్చల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇరువురి భేటీ అనంతరం ఇరు దేశాలు సంయుక్తంగా మీడియా ప్రకటన విడుదల చేయనున్నాయి.
Mahabalipuram: Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping attend cultural program at the Shore Temple, a UNESCO World Heritage site. pic.twitter.com/XynWn8jVFf
— ANI (@ANI) October 11, 2019
జిన్ పింగ్ రాక సందర్భంగా చెన్నైతోపాటు మామళ్లపురంకు దారితీసే రహదారులన్నింటినీ ఎంతో అందంగా ముస్తాబు చేశారు. తమిళనాడు ఉద్యానవన శాఖ పద్దెనిమిది రకాల పండ్లు, కూరగాయలను స్వాగత తోరణాలుగా మలిచి స్వాగత ద్వారాలను అలంకరించింది.