న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి నెలలో మొత్తం 34.5 మి.మీ వర్షాలు నమోదయ్యాయని.. గత పదేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని స్కైమెట్ వాతావరణ నివేదిక వెల్లడించింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో గురువారం 17.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఢిల్లీలో ఈసారి నెలవారీ 19.1 మి.మీ. సగటు వర్షపాతాన్ని మించిన వర్షపాతం నమోదైనట్టు స్కైమెట్ పేర్కొంది. గురువారం రాత్రి కురిసిన వర్షంతో శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. దేశ రాజధానిని పొగమంచు కప్పేయగా.. గాలిలో కాలుష్యం లెవెల్స్ కూడా భారీగా పెరిగాయి.
జనవరి 18 నుంచి గజగజ వణికించనున్న చలి..
గాలి కాలుష్యం సంగతిలా ఉండగా.. జనవరి 18 శనివారం నుంచి ఢిల్లీ వాసులకు మరిన్ని కష్టాలు తోడవనున్నాయి. ఢిల్లీతో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగనుండటమే అందుకు కారణం. జనవరి 16న 11 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదైన ఉష్ణోగ్రతలు.. జనవరి 17న 6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు చెబుతున్నాయి.
కప్పుకుంటున్న మంచు దుప్పటి..
ఢిల్లీని పొగమంచు కప్పేస్తుండటంతో ఢిల్లీ మీదుగా రాకపోకలు సాగించే రైల్వే సర్వీసులు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం నాడు ఢిల్లీకి చేరుకోవాల్సిన 19 రైళ్లు ఆలస్యంగా గమ్యం చేరుకున్నాయి. గత రెండు, మూడు వారాలుగా నిత్యం రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతుండటం గమనార్హం. తొలుత హిమాలయాలను తాకనున్న చలి ప్రభావం.. ఆ తర్వాత జనవరి 20 నుండి మిగతా ప్రదేశాలకూ వ్యాపించే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో మంచు దుప్పటి కప్పేసింది.