బీజేపీ ఓటమే లక్ష్యంగా.. జోరందుకున్న మమత కూటమి ప్రయత్నాలు!

2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ చేస్తున్న కూటమి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.

Last Updated : Aug 2, 2018, 01:34 PM IST
బీజేపీ ఓటమే లక్ష్యంగా..  జోరందుకున్న మమత కూటమి ప్రయత్నాలు!

2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ చేస్తున్న కూటమి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. బుధవారం బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌.కె.అద్వానీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌, సోనియాగాంధీ, మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు టీడీపీ, వైసీపీ, డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ తదితర పార్టీల నేతలతో సమావేశం అయ్యారు. కొన్ని ఎన్డీయే మిత్రపక్షాలతోను మమతా బెనర్జీ భేటీ కానున్నట్లు టీఎంసీ వర్గాలు వెల్లడించాయి.

అనంతరం మమతా మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని పదవిపై తనకు ఆసక్తి లేదని, అత్యున్నత రాజకీయ పదవికి నేను ఎవరికీ పోటీ కాదని మమతా తేల్చిచెప్పారు. ఎన్నికల తర్వాత విపక్ష పార్టీల సమిష్టి నిర్ణయంతోనే ప్రధాని అభ్యర్థిపై నిర్ణయిస్తామని అన్నారు. ప్రతిపక్షాల ఐక్యతను చాటేలా వచ్చే ఏడాది జనవరి 19న తాను చేపట్టబోయే మెగా ర్యాలీకి మద్దతుగా రావాలని కోరుతూ వివిధ పక్షాల నేతలను కలిసినట్లు చెప్పారు.

ఇదిలావుండగా, తమతో చేరడానికి ఎన్డీయే మిత్రపక్షం శివసేనను కూడా దాదాపు ఒప్పించినట్లు కనిపిస్తోంది. ఆపార్టీకి చెందిన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కూడా మమతతో భేటీ కావడం చర్చనీయాంశం అయింది. దాంతో 2019 జనవరి 19న మమత బెనర్జీ నిర్వహించే భారీ ర్యాలీలో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే పాల్గొననున్నారని జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. కాగా శివసేన గత కొన్ని రోజులుగా బీజేపీ తీరును ఎండగడుతోంది. సామ్నా పత్రికలో బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. మిత్రపక్షమైన బీజేపీని గతంలో బహిరంగంగా సమర్థించాం. ఇక బహిరంగంగా వ్యతిరేకిస్తామని సామ్నా ఇంటర్వ్యూలో ఉద్ధవ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Trending News