దేవికా నట్వర్ లాల్ రొటావన్.. 26/11 ముంబయి దాడులు జరిగినప్పుడు ఆమె తొమ్మిదేళ్ల బాలిక. ఉగ్రవాదుల కాల్పుల్లో తుపాకీ గుండ్లు తగిలి కూడా బతికిన ధీరురాలు. అంతే కాదు..ఉగ్రవాది కసబ్‌ను గుర్తుపట్టడానికి పోలీసులు ఎంక్వయరీ కమీషన్ వేసినప్పుడు దేవిక ప్రధాన సాక్షి కూడా. అయితే ఆ సాక్ష్యం చెప్పడమే తన కుటుంబం పాలిట శాపమైంది. రాజస్థాన్‌లో ఒక మారుమూల గ్రామంలో నివసించే ఆమె కుటుంబాన్ని బంధువులు, మిత్రులు బహిష్కరించారు. దేవిక ప్రధాన సాక్షి కాబట్టి.. ఎక్కడ ఉగ్రవాదులు తమపై కూడా దాడి చేస్తారేమోనన్న భయంతో దేవిక కుటుంబంతో మాట్లాడడం గానీ, వివాహాది కార్యక్రమాలకు పిలవడం గానీ వారు మానుకున్నారట. దాంతో దేవిక కుటుంబం ఊరు విడిచి తమ అయినవారికి దూరంగా వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు కూడా లభించలేదు.
ఇటీవలే ముంబయి దాడులు జరిగి 9 సంవత్సరాలు కావస్తోన్న సందర్భంలో మళ్లీ దేవిక వార్తల్లోకి వచ్చింది. ఈ సంవత్సరమే 18 ఏళ్ళు నిండిన ఆమె దీనమైన కథ పలువురిని కదిలించింది.అయితే ఆమె కథను తెలుసుకున్న సందీప్ బింగుడే అనే జవాన్ దీపికను చదివించడానికి ముందుకొచ్చారు. తపోవన్ అనే స్వచ్చంద సంస్థ దీపికకు ఒక చిన్న ఇల్లు కట్టివ్వడానికి ప్రయత్నిస్తోంది.
ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ దేవిక తన అనుభవాలు పంచుకున్నారు. "నా పై కాల్పులు జరిగినప్పుడు ఆ వ్యక్తిని నేను కచ్చితంగా గుర్తుపట్టాను. తర్వాత పదే పదే పోలీసులు గుర్తుపట్టమని కోరారు. కసబ్ కేసులో నేనే ప్రధాన సాక్షిని. అయితే ఆ తర్వాత మా కుటుంబ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మామయ్యలు, బాబాయిలు, అత్తమ్మలూ.. అందరూ మమ్మల్ని భయంతో దూరంపెట్టారు. మాతో పూర్తిగా మాట్లాడడం మానేశారు. వారి ఇంట్లో ఫంక్షన్లకూ మమ్మల్ని పిలిచేవారు కాదు. కొన్నాళ్లకు ఆ ఊరు విడిచిపెట్టి మేము వెళ్లిపోయాం" అని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకి దూరమైన దీపికను చదివించడానికి వచ్చిన సందీప్ బింగుడే స్ఫూర్తితో మరికొందరు దీపికకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కాల్పులకు గురైన ఎంతోమంది బాధితులు ఉగ్రవాదిని గుర్తుపట్టడానికి సంశయించిన సందర్భంలో దీపిక ప్రధాన సాక్ష్యంగా నిలవడంతో పోలీసుల ఎంక్వయరీ సజావుగా సాగింది. నేరస్థుడికి ఉరి శిక్ష కూడా పడింది.