న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ఫిబ్రవరి 8న ఒకే దశలో ఈ పోలింగ్ నిర్వహించనుండగా, 11వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన తెలిపారు. కాగా, ఫిబ్రవరి 22తో ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్ ప్రకటించింది.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ నెల 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని సీఈసీ తెలిపారు. నామినేషన్లకు జనవరి 21 చివరి తేదీ. తర్వాత నామినేషన్ల పరిశీలన జనవరి 22న జరుగుతుంది. అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకునేందుకు చివరి తేదీ జనవరి 24 అని సునీల్ ఆరోరా వెల్లడించారు.
Delhi assembly elections to be held on 8 February; counting of votes on 11th February pic.twitter.com/ApYhjMjgMv
— ANI (@ANI) January 6, 2020
జవనరి 6వరకు నమోదైన ప్రకారం మొత్తం 1,46,92,136 మంది ఓటర్లున్నారని ఆయన తెలిపారు. మొత్తం 13,750 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహించన్నుట్లు వెల్లడించారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. 70 స్థానాలకుగానూ 67 సీట్లు కైవసం చేసుకుని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి తెరతీయగా, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. మరోసారి అధికారం చేపట్టాలని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భావిస్తుండగా, గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది.